పీపీపీ మాటున చంద్రబాబు దోపిడీ
నెల్లూరు రూరల్: ‘గవర్నర్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం అసత్యాలు చెప్పించింది. పీపీపీ మోడల్ పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారు’ అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. పీపీపీ అంటే పైసలు, పత్రికలు, పోలీసులను అడ్డం పెట్టుకుని దోచుకోవడమేనన్నారు. అమరావతిలో తానెక్కడికెళ్లి విచారించినా దోపిడీయే కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోవడం మానేశారన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీలు అందక లక్షల మంది విద్యార్థులు దారుణ పరిస్థితుల్లో సతమతమవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు రోజురోజుకూ బలహీనపడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.
కండలేరులో 57 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 57 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


