రాష్ట్రంలో మహిళలకు రక్షణేదీ..?
నెల్లూరు రూరల్: టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆమె మాట్లాడారు. గంజాయి బ్యాచ్ దాష్టీకానికి బాలిక మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడపిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. జగనన్న హయాంలో దిశ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పించిన అంశాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువై.. యువత పెడదారి పడుతోందని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యంతోనే బాలిక మరణించిందని మండిపడ్డారు. నెల్లూరులోని ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, మంచి వైద్యాన్ని అందించి ఉంటే బాలిక బతికేదన్నారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు పెట్టడాన్ని చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామాననే అనుమానం తలెత్తుతోందని చెప్పారు. గంజాయి బ్యాచ్‌లను కూటమి నేతలే పెంచి పోషిస్తూ తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. బాధ్యులను శిక్షించి, కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో తమ పార్టీ తరఫున పోరాటం చేయనున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కాకాణి పూజిత


