త్వరితగతిన ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు
● ఏపీఎస్పీడీసీఎల్ సీజేఎం కృష్ణారెడ్డి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘వేసవి కాలంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రిపేర్లకు వచ్చే ట్రాన్స్‌ఫార్మర్లకు త్వరితగతిన మరమ్మతులు చేయాలి’ అని ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (ఓఅండ్‌ఎం) ఎం.కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులోని కొత్తూరులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్స్ మరమ్మతుల కేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నెల్లూరు, కావలి, ఆత్మకూరు, పొదలకూరు ప్రాంతాల్లో ఈ కేంద్రాలున్నాయన్నారు. మరో నాలుగు ప్రైవేట్ కేంద్రాలున్నట్లు చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్లు అధిక విద్యుత్ లోడ్‌కు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీర్లదే అన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటికి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ కార్యాచరణ రూపొందిచుకోవాలని ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణతో ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్లను తగ్గించుకోవచ్చని చెప్పారు.
రికార్డుల నిర్వహణపై అసహనం
కేంద్రంలోని రికార్డులను, స్టాక్‌ను కృష్ణారెడ్డి పరిశీలించారు. మరమ్మతుల సమయంలో ఉపయోగించే రాగితీగలు, ఆయిల్ వినియోగం, ఎన్ని రిపేర్లకు వచ్చాయి, వాటి స్థానంలో ఎన్ని పంపించారో వివరాల రిజిస్టర్లను చూశారు. కాగా రికార్డుల నిర్వహణపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఈ రాఘవేంద్రం, ఈఈలు శేషాద్రిబాలచంద్ర, శ్రీధర్, లక్ష్మీనారాయణ, డీఈఈ రాజాబాబు, ఏఈ సునీల్ తదితరులు పాల్గొన్నారు.


