జిల్లాలో పేట్రేగుతున్న గంజాయి బ్యాచ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘జిల్లాలో గంజాయి బ్యాచ్ చేతుల్లో వరుస హత్యలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో చర్యలు తీసుకునేందుకు పోలీసులు, అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఆడపిల్లల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది’ అని ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్‌బీ, ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, నరసింహ అన్నారు. నెల్లూరు బాలాజీ నగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆడపిల్లలను గంజాయి బ్యాచ్‌ల నుంచి ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు అర్థం కావడం లేదన్నారు. గుమ్మళ్లదిబ్బ ప్రాంతంలోని పాఠశాల వద్ద గంజాయి మత్తులో యువకులు నిత్యం తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాలిక మృతిచెందిందని ఆరోపించారు. గతేడాది నవంబర్‌లో గంజాయి బ్యాచ్ చేతిలో పెంచలయ్య హత్యకు గురయ్యాడన్నారు. నేడు కోవూరు నియోజకవర్గంలో బాలిక అఘాయిత్యానికి గురై మృతిచెందడం బాధాకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం గంజాయి వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందన్నారు. నెల్లూరు జిల్లాలో గంజాయి బ్యాచ్‌ల చేతుల్లో రెండు హత్యలు జరిగితే సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విచారకరమన్నారు. బాలిక మృతిలో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాలికకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోమవారం మండల కేంద్రాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన వరలక్ష్మి, కత్తి పద్మ, సుబ్బమ్మ, రియాజ్, యణ్నేష్, అమర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
చోద్యం చూస్తున్న పోలీసులు
హత్యలపై స్పందించని సీఎం, హోంమంత్రి
వివిధ సంఘాల నేతలు


