20న రజకుల మహాధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రజకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఈనెల 20వ తేదీన తాడేపల్లిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే ‘రజకుల మహాధర్నా’ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య పిలుపునిచ్చారు. నగరంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు రజక వృత్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పథకాలు అందజేయలేదని ఆరోపించారు. రజకుల సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రజక వృత్తిదారులపై అక్రమ కేసులు, మహిళలపై దాడులు, బాలికలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్రమకు తగిన వేతనం అందడం లేదన్నారు. కార్మిక శాఖ ద్వారా సర్వే నిర్వహించి గుర్తింపుకార్డులు ఇవ్వాలన్నారు. సమావేశంలో నాయకులు గుంజి దయాకర్, కసుమూరు రమేష్, కటికాల వెంకటేశ్వర్లు, సుబ్బారావు, అంకయ్య, రమణయ్య, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.


