కొండను తవ్వేస్తున్నారు.. స్పందించండి
నెల్లూరు రూరల్: సైదాపురం మండలంలోని మొలకలపూండ్ల వద్ద ఉన్న పుణ్యక్షేత్రమైన సిద్ధేశ్వరస్వామి కొండను మైనింగ్ చేసి దోచుకుంటున్నారని అదే గ్రామానికి చెందిన ఆదురు బద్రీనాథ్ ఆరోపించారు. బుధవారం నెల్లూరులోని జర్నలిస్ట్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొండకు గిరి ప్రదక్షిణ బాట కూడా ఉందన్నారు. ఇక్కడ్నుంచి 200 మీటర్లు వదిలి మైనింగ్ పనులు చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే ఒగ్గు కృష్ణయ్య, ఆదూరు కిశోర్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరు చెబుతూ కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా భారీ యంత్రాలతో, బాణసంచా పేల్చి ఖనిజాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, ఎంపీ, మైనింగ్ అధికారులను కోరినా స్పందన లేదన్నారు. దేవదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా చర్యలు శూన్యమన్నారు. తెలుగుగంగ కాలవను కూడా ఆక్రమించి మైనింగ్ చేయాలని చూస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ స్పందించాలని కోరారు. మైనింగ్ లీజును రద్దు చేయాలన్నారు.


