మరికొన్ని బ్యాంక్‌ల విలీనానికి అవకాశం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రభుత్వరంగ బ్యాంక్‌లను విలీనం చేసింది. రానున్న కాలంలో మరిన్నింటిని విలీనం చేయడం, ప్రైవేటీకరించేందుకు అవకాశం ఉంది’ అని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం సంయుక్త కార్యదర్శి ఉదయ్‌కుమార్ అన్నారు. నెల్లూరులోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం ఏపీ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు రీజియన్ 2వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించారు. దీనికి నెల్లూరు రీజీయన్ పరిధిలో పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు విచ్చేశారు. ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ 2020లో మూడు బ్యాంక్‌లను విలీనం చేశారన్నారు. 2024 మార్చి 8వ తేదీన బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ బ్యాంక్స్ ఫోరం బ్యాంక్ యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని నిర్ణయించినా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం దారుణమన్నారు. గత నెల 27వ తేదీన ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారన్నారు. ఈనెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజియన్ డిప్యూటీ హెడ్స్ వేణుగోపాల్, శివశంకర్, యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, విజయ్‌భాస్కర్, లక్ష్మీపతి, శ్రీనివాస్, సుమన్, స్వాతి, మృదుల తదితరులు పాల్గొన్నారు.


