డీఈఐఈడీ ఫీజును 17లోపు చెల్లించాలి
నెల్లూరు (టౌన్): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 2025 – 27 విద్యా సంవత్సరానికి చెందిన రెగ్యులర్ విద్యార్థులు.. 2023 – 25, 2024 – 26లో ఒకసారి ఫెయిలైన వారు పరీక్ష ఫీజును ఈ నెల 17లోపు చెల్లించాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. రూ.50 అపరాధ రుసుముతో 24 వరకు అవకాశం ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.140, రెండింటికి రూ.120, ఒక దానికి రూ.వంద చెల్లించాలని తెలిపారు. డీఈఐఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలను త్వరలో నిర్వహించనున్నామని వెల్లడించారు.
కావలిలో జాబ్ మేళా రేపు
నెల్లూరు(పొగతోట): కావలిలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాను ఏపీఎస్సెస్డీసీ, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్, సీడాప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నాయని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 72868 22789, 99888 53335 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
18 నుంచి టెక్నికల్
సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
నెల్లూరు (టౌన్): డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్లకు సంబంధించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను www. bse.ap.gov.inలో అందుబాటులో ఉంచామని చెప్పారు. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును తప్పక తీసుకురావాలని కోరారు.
నెల్లూరు చేరిన సైక్లథాన్
నెల్లూరు(క్రైమ్): తీర ప్రాంత భద్రత.. యువత మత్తు బారిన పడకుండా.. వారిలో చైతన్యం కల్పించేందుకు సీఐఎస్‌ఎఫ్ చేపట్టిన వందేమాతరం కోస్టల్ సైక్లథాన్ నెల్లూరుకు బుధవారం చేరుకుంది. వీరికి పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐఎస్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ సంజీత్‌కుమార్ మాట్లాడారు. వందేమాతరాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాతృభూమి రక్షణ, దేశం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కోస్టల్ సైక్లథాన్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. కోల్‌కతాలో జనవరి 28న ప్రారంభమైన యాత్ర కేరళలోని కొచ్చిలో ఈ నెల 23న ముగియనుందని వెల్లడించారు. నగర ఏఎస్పీ దీక్ష, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఇండియన్ కోస్టల్ గార్డ్ కృష్ణపట్నం పోర్టు కమాండెంట్ కార్తీక్, మారుతి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ షామిలీ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 73,983 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 21,900 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
డీఈఐఈడీ ఫీజును 17లోపు చెల్లించాలి


