మోసపోయి..
● డబ్బులిస్తే కొలువులు ఇప్పిస్తామంటూ మోసాలు
● పీజీఆర్‌ఎస్‌కు తరలివస్తున్న
బాధితులు
నెల్లూరు(క్రైమ్): ‘నాకు వాళ్లు.. వీళ్లు తెలుసు. నేనెంత చెబితే అంత. భారీ ప్యాకేజీతో నీకు జాబ్ వచ్చేస్తుంది. కాకపోతే దీనికి కొంత మొత్తం ఖర్చవుతుంది. అది చూసుకుంటే సరిపోతుంది. వెంటనే ఆఫర్ లెటర్ పంపేస్తారు’ ఇలాంటి మాటలకు మోసపోతున్న వారి సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. ప్రతి సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి బాధితులు పెద్దసంఖ్యలో వచ్చి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.
అనేక కారణాలు
చదువుకు తగిన ఉద్యోగాలు రానివారు ఎంతోమంది జిల్లాలో ఉన్నారు. వారిని, తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ శాఖలు, ప్రముఖ ప్రైవేట్ సంస్థలు, ఐటీ రంగం, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, దీంతో జీవితంలో స్థిరపడొచ్చని ఆశచూపుతూ ఉచ్చులోకి దింపి పెద్ద మొత్తంలో నగదు కాజేస్తున్నారు. డబ్బులు జేబుల్లోకి వెళ్లగానే ముఖం చాటేస్తున్నారు. మరికొందరు తమకున్న పలుకుబడితో బాధితులపైనే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నవారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు డబ్బులు పోతేపోయాయి పరువు పోతుందని, ఉన్నతవిద్య అభ్యసించి కూడా మోసపోయారంటారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఉద్యోగాల పేరిట మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
ఏం చేస్తారంటే..
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ క్రమపద్ధతిలో జరుగుతుంది. ముందుగా ప్రకటన ఇచ్చి రాతపరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. డబ్బులు కట్టించుకుని ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు. దీనిపై అవగాహన లేనివారు మోసాలకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో మోసగాళ్లు ఇచ్చే ప్రకటనలు, నకిలీ కన్సల్టెన్సీలను నమ్మి వారిని సంప్రదిస్తున్నారు. దేశ, విదేశాల్లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో రూ.లక్షల్లో ప్యాకేజీ ఇస్తామని చెప్పిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా డబ్బు ఇచ్చేస్తున్నారు. దీంతో చివరకు మోసపోయి గుండెలు బాదుకుంటున్నారు. ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వెబ్‌సైట్ సరైనదో కాదో పరిశీలించాలి. అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్‌చేసి వివరాలు తెలుసుకోకుండా ఆ సంస్థ ప్రధాన కార్యాలయం లేదా శాఖా కార్యాలయానికి వెళ్లి నిర్ధారించుకోవాలి. ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల విషయంలోనూ ఆయా కార్యాలయాలను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి.
ఇందుకూరుపేటకు చెందిన ఇద్దరికి అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా పరిచయమయ్యాడు. సాఫ్ట్‌వేర్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షలు తీసుకుని మోసగించారు. దీంతో బాధితులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నెల్లూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు కొందరి వద్ద రూ.15 లక్షలు తీసుకుని మోసగించారు.
కోట పరిధికి చెందిన ఓ వ్యక్తికి దుబాయిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్ వాసి రూ.4.50 లక్షలు తీసుకున్నాడు.


