అక్రమ కేసులు తప్ప సక్రమ పాలనేదీ?
నెల్లూరురూరల్: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపక్షంపై అక్రమ కేసులు తప్ప.. సక్రమ పాలనేదని మాజీ మంత్రి విడదల రజిని దుయ్యబట్టారు. జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న పిన్నెల్లి సోదరులను విడదల రజిని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత సోమవారం ములాకత్ అయ్యారు. ఈ సందర్భంగా విడదల రజని మాట్లాడుతూ పల్నాడు ఎస్పీ స్వయంగా టీడీపీ వాళ్ల ఆధిపత్య పోరులోనే హత్య జరిగిందని అని స్వయంగా ప్రకటించినా కూడా.. పిన్నెల్లి సోదరులపై అక్రమంగా హత్య కేసు బనాయించి జైలుకు పంపడం దారుణమన్నారు. పిన్నెల్లి సోదరులు ఎటువంటి తప్పు చేయలేదన్నారు. టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. మాజీ మంత్రుల మీద వరుస దాడులను ప్రోత్సహిస్తూ, మాపైనే అక్రమ కేసులు పెడుతుందన్నారు. గుడికి వెళ్లి పూజలు చేసుకుని బయటకు వస్తే నా మీద కూడా కేసులు నమోదు చేసిందన్నారు. ఇటువంటి దాడులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరని తెలిపారు. టీడీపీ అరాచకాలను కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నిస్తుంటే ఆయన మీద పదే పదే కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో తిప్పి పంపిన ట్యాంకర్లను మళ్లీ తెప్పించి లడ్డూలో వాడేసి తమపైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎక్కడా జంతువు కలవలేదని సిట్ రిపోర్ట్ ఇస్తే అడ్డగోలుగా వాదిస్తున్నారన్నారు. చేసిన తప్పుడు పనులను కప్పిపుచ్చేందుకే అవాస్తవ ప్రచారాలతో అడ్డదిడ్డంగా వాదిస్తున్నారన్నారు.
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జైలు అధికారులు పిన్నెల్లి సోదరులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని తెలిపారు. చంద్రబాబు కక్ష సాధింపులతో వ్యవహరిస్తున్నాడన్నారు. మామూలు ఖైదీ కన్నా దారుణంగా చూస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం కత్తులు, కర్రలు, పెట్రోల్ బాంబులతో పాలన సాగిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం సంస్కృతిగా మారిపోయిందన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని టీడీపీ వాళ్లే చెబుతున్నారన్నారు. కక్ష సాధింపులో భాగమవుతున్న అధికారులపై ప్రభుత్వం మారాక చట్టరీత్యా చర్యలు తీసుకొని జైల్లోకి పంపుతామన్నారు. కేసులకు ఏ వైఎస్సార్సీపీ కార్యకర్త భయపడరని తెలిపారు.
● రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ తప్పుడు కేసులతో జైల్లో పెట్టడం మంచి పద్ధతి కాదని తెలిపారు. సంబంధంలేని కేసుల్లో ఇరికించడం ఈ ప్రభుత్వం స్పెషాలిటీ అన్నారు. అక్రమ కేసుల్లో మా నాన్నను జైల్లో పెట్టినప్పుడు నేను ఎంతో బాధపడ్డానని తెలిపారు. తిరుమల లడ్డూను స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్నారు. స్కామ్‌లు చేయడం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రజలు పాలనను అసహ్యించుకుంటున్నారన్నారు.
గుడికి వెళ్లి బయటకు వచ్చిన
నాపైనా కేసు నమోదు
టీడీపీ అరాచకాలను ప్రశ్నిస్తున్నాడని కాకాణి అన్నపై పదేపదే కేసులు
ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో హత్య జరిగిందని ఎస్పీనే చెప్పారు
అయినా పిన్నెల్లి సోదరులపై
అక్రమంగా హత్య కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజిని
జైల్లో పిన్నెల్లి సోదరులను
పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు


