పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరురూరల్: వైఎస్సార్‌సీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మేజర్ పంచాయతీ నాయకులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. పార్టీ కమిటీల నియామకంపై చర్చించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో జెండాను భుజాన వేసుకుని మోసే వాళ్లను గుర్తుంచుకుని భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ విస్తృత స్థాయి కమిటీల రూపకల్పనకు నాంది పలికామన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా ఉత్సాహంగా, ఉల్లాసంగా కమిటీల నియామకంలో నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయడం అత్యంత సంతోషం కలిగించే విషయమన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారికి పార్టీ పరంగా ఎల్లవేళలా అండగా నిలుస్తామన్నారు. పార్టీ నాయకులు ఎటువంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలతో కలిసి పని చేయాలన్నారు. జగనన్న 2.0 లో కార్యకర్తలకు ప్రత్యేక స్థానం కల్పిస్తామని ఇప్పటికే జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పోకడలతో ప్రజలను మోసం చేస్తోందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంతో పాటు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం 19 నెలల పాలనలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను పోగేసుకుందన్నారు. సోమశిల జలాశయంలో సమృద్ధిగా నీరున్నా రైతులకు సాగునీరు అందించలేని అసమర్ధ ప్రభుత్వంగా కూటమిపై ముద్ర పడిందన్నారు. సోమిరెడ్డి వంటి నాయకులు ఇరిగేషన్ పనులు చేయకుండానే దొంగ బిల్లులు భోంచేయడం చూస్తే రైతులను అడ్డుపెట్టి ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో అర్ధమవుతుందన్నారు. సర్వేపల్లిలో నిద్రలేచినప్పటి నుంచి దోపిడీకి పాల్పడడం తప్ప, ప్రజల గురించి పట్టించుకునేనాథుడే కరువయ్యాడన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరించేందుకు పోరాటం చేద్దామన్నారు. జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.


