గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కోవూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బకు చెందిన మైనర్ బాలికపై గంజాయి మత్తులో ఇద్దరు బాలురు అఘాయిత్యానికి పాల్పడడంతో, ఆ బాలిక మృతికి సంతాపంగా నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్ మాట్లాడుతూ మైనర్ బాలికపై అఘాయిత్యం, హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, మూడు నెలల క్రితం పెంచలయ్యను గంజాయి బ్యాచ్ హత్య చేశారని, ఇప్పుడు గంజాయి అరాచకాలకు బలైపోయిన బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి వాడకం, రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయి రహిత జిల్లాగా నెల్లూరును మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఆవాజ్, ఐద్వా, ప్రజానాట్యమండలి నాయకులు విక్రమ్, నరేంద్ర, రమణ, నరసింహ, శివకుమారి, గండవరపు శేషయ్య తదితరులు, పాల్గొన్నారు.


