కుమారుడే హంతకుడు
● రైల్వే ఉద్యోగి హత్య కేసును
ఛేదించిన పోలీసులు
● కుటుంబ, ఆస్తి వివాదాలే కారణం
కావలి రూరల్: కావలి మండలం రుద్రకోటలో ఇటీవల జరిగిన రైల్వే ఉద్యోగి ఆరే నాగరాజు (47) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలోనే కుమారుడే హత్యకు పాల్పడినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఆయన సోమవారం పట్టణంలోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాగరాజు, భార్య మాధవికి మధ్య పదేళ్లుగా విభేదాలున్నాయి. ఆమె తన ముగ్గురు కుమారులతో కలిసి చిన్నగంజాంలోని పుట్టింట్లో ఉంటోంది. నాగరాజు రుద్రకోటలోని ఎస్సీ కాలనీలో భార్య పేరుపై ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నాడు. పిల్లల చదువులు, పెద్ద కుమారుడి వివాహం కోసం మాధవి అప్పులు చేసింది. నాగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం చేయకుండా డబ్బును విలాసాలకే ఖర్చు చేసేవాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో రుద్రకోట ఇంటిని అమ్మాలని భార్య, రెండో కుమారుడు నవీన్‌బాబు పలుమార్లు నాగరాజును కోరారు. అయితే అతను అందుకు అంగీకరించలేదు. ఆ ఇంటిని తన పేరుపై మార్చుకునే ప్రయత్నం చేశాడు. దీంతో విసిగిపోయిన మాధవి, నవీన్‌బాబులు నాగరాజును అడ్డుతొలగించుకోవాలని 15 రోజుల క్రితం నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నవీన్‌బాబు రుద్రకోటలోనే ఉంటూ తండ్రితో సఖ్యతగా ఉన్నట్లు నటించాడు. ఈనెల 5వ తేదీ రాత్రి నాగరాజు మద్యం మత్తులో ఉండగా రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు మృతదేహంపై మరికొన్ని గాయాలు చేసి పరారయ్యాడు. పోలీసుల విచారణలో దొరికిపోతామనే భయంతో మాధవి, నవీన్‌బాబు వీఆర్వో జనార్దన్ ఎదుట లొంగిపోయారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. సమావేశంలో రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సైలు తిరుమలరెడ్డి, బాజీరావు పాల్గొన్నారు.


