ఆదుకోండయ్యా..
అనారోగ్యంతో
బాధపడుతున్న బాలుడు
● మందులు కొనలేని స్థితిలో పేద కుటుంబం
● దివ్యాంగ పింఛన్ కోసం ఎదురుచూపులు
సోమశిల: ఆటపాటలతో సాగాల్సిన ఆ బాలుడి జీవితం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలోని పాతదేవరాయపల్లి గ్రామంలో చిచ్చు గురవయ్య, సుభాషి ణి దంపతులు నివాసముంటున్నారు. వారి కుమారుడు సంతోష్ వయస్సు 12 సంవత్సరాలు. వీరిది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. కాగా ఎనిమిదేళ్లుగా సంతోష్ ఎముకలు, నరాల బలహీనత, కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నాడు. కొంచెం దూరం కూడా నడవలేడు. తోటిపిల్లలతో ఆడుకోలేడు. తనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరుగుతుండటంతో బ్యాగ్ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు అనేక ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో చూపించారు. అయినా లాభం లేకుండా పోయింది. మందులు తప్పనిసరిగా వాడాలని వైద్యులు చెప్పారు.
పింఛన్ కోసం..
తల్లిదండ్రులు రోజూ కూలీ పనికి వెళ్తేనే సంతోష్‌కు మాత్రలు కొనుగోలు చేయగలరు. వాటికి నెలకు రూ.5 వేలు, ఇతర అవసరాలకు మరో రూ.4 వేలు ఖర్చవుతుంది. అయితే అంత మొత్తం ఖర్చుచేసే స్థితిలో ఆ కుటుంబం లేదు. గతంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా డాక్టర్లు పరీక్షించి 74 శాతంతో సదరం సర్టిఫికెట్ అందజేశారు. సంతోష్‌కు పింఛన్ కోసం తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు కాలేదు. పింఛన్ వస్తే కొంత ఆసరాగా ఉంటుందని పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగారు. ప్రభుత్వం నూతన పెన్షన్లు విడుదల చేస్తే మీ అబ్బాయికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. బిడ్డకు మందులు కొనేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.


