ప్రాణాలు పోయినా.. హక్కులు కాపాడుకుంటాం
● గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష
● వెనక్కి తగ్గేది లేదంటున్న గిరిజన నేతలు బాపట్ల వెంకటపతి, తలపల జయవర్ధన్
● గిరిజన ప్రాణాలకు హాని జరిగితే ఆ పాపం నీలం సాహ్నిదే
నెల్లూరు (దర్గామిట్ట): గిరిజనుల హక్కులను కాపాడుకునేందుకు ప్రాణాలు పణంగా పెట్టేందుకు కూడా సిద్ధమేనని గిరిజన నేతలు బాపట్ల వెంకటపతి, తలపల జయవర్ధన్ స్పష్టం చేశారు. గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షను సోమవారం ప్రారంభించారు. కొద్ది రోజులుగా గిరిజన సంఘాలు రిలే దీక్షలు చేస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా బాపట్ల వెంకటపతి, తలపల జయవర్ధన్ విలేకరులతో మాట్లాడారు. తమ హక్కుల సాధనకు శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. నెల్లూరురూరల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా భ్రష్టుపట్టించి, అడ్డగోలు దోపిడీతో రాజ్యమేలుతున్నాడని విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడం శోచనీయమని, తమ ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే ఇందుకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిదే బాధ్య త అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత పంట శ్రీనివాసులు రెడ్డి, గిరిజన నాయకులు యాకసిరి మురళి, చేవూరు శ్రీనివాసులు, ఏకుల సుధీర్, బత్తెన లక్ష్మణ శేఖర్, గందల రమేష్, సురేంద్ర, గిరిజనులు మద్దతు పలికారు.
మేయర్ ఎన్నికకు
నోటిఫికేషన్ జారీ
● ఈ నెల 26న ఎన్నికల ప్రక్రియ
నెల్లూరు (బారకాసు): నెల్లూరు నగర మేయర్ స్థానానికి ఎన్నిక నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26న కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం ఆ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని పేర్కొంది. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌గా గెలుపొందిన పొట్లూరి స్రవంతిపై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. దీంతో ఆమె మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇన్‌చార్జి మేయర్‌గా డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ బాధ్యతలు చేపట్టారు. గిరిజన మహిళకు కేటాయించిన మేయర్ పదవిలో బీసీ ఉండడంతో వెంటనే ఎన్నిక నిర్వహించాలని మాజీ మేయర్ స్రవంతి కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశంలో నిరసన తెలియజేశారు. గిరిజన సంఘాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడుతున్నాయి. ఈ పరిణామాలను ఢిల్లీ స్థాయిలో పెద్దలకు తెలియజేసేందుకు మాజీ మేయర్ వెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం.
శ్రీవారి దర్శనానికి
10 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఓ మాదిరిగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఆదివారం 80,502 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,608 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కండలేరులో
56.280 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమ వారం నాటికి 56.280 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నట్లు వివరించారు.
ప్రాణాలు పోయినా.. హక్కులు కాపాడుకుంటాం
ప్రాణాలు పోయినా.. హక్కులు కాపాడుకుంటాం


