శ్రీవారి ప్రసాదంపై రాజకీయం దుర్మార్గం
● వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్
సమన్వయకర్త విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం భగవంతుని ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి మండిపడ్డారు. రూరల్‌లోని చింతారెడ్డిపాళెంలో పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసత్యాన్ని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. టీటీడీ లడ్డూ తయారీలో అవినీతి, కల్తీ జరిగిందని ప్రజల విశ్వాసాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఆయనకు తోడుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడారన్నారు. భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిపై నిందలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లమంది ఆరాధించే వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు విషప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఇప్పుడు కెమికల్స్ కలిశాయని మరో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు వత్తాసుగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. కాషాయం ధరించి వాస్తవాలు తెలుసుకోకుండా ఇటువంటి మాటలు చెప్పడం దారుణమన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని నిగ్గుతేలిన తర్వాత కూడా హిందూ ధార్మిక సంస్థల అధిపతులు, పీఠాధిపతులు, చంద్రబాబు, పవన్ కళ్యాన్‌ను క్షమాపణ చెప్పాలని అడగలేరా అని ప్రశ్నించారు. నిజాన్ని ప్రశ్నించిన రోజే గౌరవం లభిస్తుందన్నారు. ప్రవచనకర్తలు కూడా హెచ్చరించాల్సిన అవసరం లేదా అన్నారు. కూటమి ప్రభుత్వాని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, ఇళ్లు తగులబెట్టడం చేస్తున్నారన్నారన్నారు. భవిష్యత్‌లో కూటమి ప్రభుత్వానికి హిందువులు సరైన సమాధానం ఇస్తారన్నారు. భగవంతుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్‌సీపీ రూరల్ మండల అధ్యక్షుడు పుచ్చలపల్లి రామ్‌ప్రసాద్, కలివెలపాళెం సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చెన్నారెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఏఐసీఎస్ మాజీ చైర్మన్ పార్లపల్లి వీరరాఘవరెడ్డి, రూరల్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు తోగూరు జాషువా, 12వ డివిజన్ ఇన్‌చార్జ్ ప్రసాద్, నాయకులు శ్రీనివాసులురెడ్డి, బాలాజీ, అక్కన్న, మదన్‌మోహన్, రాజా తదితరులు పాల్గొన్నారు.


