మా మద్యం.. మా ఇష్టం
● టీడీపీ ప్రభుత్వంలో వింత పోకడ
● నిబంధనలకు తిలోదకాలు
● కంటైనర్‌లో బార్‌ను ఏర్పాటు చేసిన వైనం
నెల్లూరు సిటీ: మద్యం విక్రయాలే పరమావధిగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మందుబాబులను ఎంత మత్తులోకి దింపితే అంత ఆదాయమొస్తుందనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. శాంతిభద్రతలు మృగ్యమైనా.. మహిళలకు రక్షణ కొరవడినా, వాటిని అరికట్టే దిశగా అడుగులేయకుండా.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా నగరంలోని జాతీయ రహదారి వద్ద దెయ్యాలదిబ్బ కాలనీకి సమీపంలో కంటైనర్‌లో బార్ అండ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. కంటైనర్ పక్కనే షామియానాలను వేసి నయా దందాను సాగిస్తున్నారు.
యాక్సిడెంట్ జోన్‌లో..
జాతీయ రహదారి వద్ద దెయ్యాల దిబ్బ కాలనీ సర్కిల్లో ఇటీవల పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, మరికొందరు మృత్యువాత పడ్డారు. అయినా వీటిని పట్టించుకోకుండా బార్‌ను ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. తాజాగా నిబంధనలకు పాతరేస్తూ సింహపురిలో కంటైనర్‌లో బార్‌ను ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. అసలే జాతీయ రహదారి.. ఆపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతంలో పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే వీధివీధినా వెలసిన వైన్ షాపులతో మహిళలకు రక్షణ కరువవుతోంటే.. ఇలా వ్యవహరిస్తుండటంపై ప్రజానీకం భగ్గుమంటోంది.
మా మద్యం.. మా ఇష్టం


