పబ్లిక్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు : డీఆర్వో
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్, మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో ఆదేశించారు. సోమ వారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇంటర్, పదోతరగతి పరీక్షలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ సెంటర్ల వద్ద తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు సకాలంలో చేరుకునేలా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆర్‌ఐఓ వరప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 23 నుంచి మార్చి 24 తేదీ వరకు 81 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 53,404 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే కంట్రోల్ రూము నంబర్ 0861–2320312ను సంప్రదించాలని సూచించారు. డీఈఓ ఆర్. బాలాజీరావు మాట్లాడుతూ జిల్లాలోని 174 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలను మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. 174 సెంటర్లలో 28,589మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. అలాగే మార్చి 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు, మార్చి 16 నుంచి 28వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, తనిఖీ బృందాలను నియమించినట్లు వివరించారు.


