రుణం చెల్లించినా.. ఇంటి పత్రాలివ్వడం లేదు
● మహిళ ఆవేదన
ఆత్మకూరు: ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్‌కు రుణం చెల్లించినా ఇంటి పత్రాలివ్వకుండా తిప్పుకొంటున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం ఆమె వివరాలు వెల్లడించారు. దుత్తలూరు మండలం తురకపల్లికి చెందిన మెట్ల సుభాషిణి 2023 సంవత్సరంలో ఆత్మకూరులోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో రూ.30 లక్షలు విలువైన తన ఇంటి పత్రాలను మార్ట్‌గేజ్ చేసి రూ.10 లక్షల రుణం తీసుకుంది. కుమారుడి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అప్పు చేసింది. చికిత్స పొందుతూ కుమారుడు మృతిచెందాడు. రూ.10 లక్షలు అసలుకు గానూ రూ.6 లక్షల వడ్డీతో కలిపి మొత్తాన్ని 2025 నవంబర్ 19వ తేదీ నాటికి పూర్తిగా చెల్లించింది. లోన్ పూర్తయినట్లు బ్యాంక్ అధికారులు రశీదులిచ్చారు. మార్ట్‌గేజ్ చేసిన ఇంటి పత్రాలు వారం రోజుల్లో ఇస్తామని చెప్పి మూడు నెలలైనా ఇవ్వకుండా తిప్పుకొంటున్నారని బాధిత మహిళ వాపోయింది. హెడ్ ఆఫీస్ నుంచి పత్రాలు రావాలని చెబుతూ వచ్చారు. గురువారం వారిని నిలదీస్తే పత్రాలు పోయాయని, డూప్లికేట్ పత్రాలు ఇస్తామని చెప్పినట్లుగా సుభాషిణి వాపోయింది. రుణం చెల్లించే క్రమంలో ఒక్కరోజు ఆలస్యమైనా రూ.800 నుంచి రూ.3 వేలు పెనాల్టీగా సిబ్బంది వసూలు చేశారని చెప్పింది. పత్రాలు ఇవ్వకపోతే బ్యాంక్ ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యకు చేసుకుంటానని పేర్కొంది. ఈ విషయమై ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వినోద్‌ను సంప్రదించగా ఆమె మార్ట్‌గేజ్ చేసిన పత్రాలు పోయిన విషయం వాస్తవమేనన్నారు. నెల్లూరులోని కార్యాలయ అధికారులకు తెలిపామని, రీ రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.


