తమ్ముళ్ల కన్ను
ఎర్ర సంపదపై
● ఎర్రచందనం అక్రమ రవాణా
● పోలీసుల అదుపులో ఆరుగురు
● అందులో సోమశిల ప్రాజెక్ట్ కమిటీ
చైర్మన్ అనుచరుడు
ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, గ్రావెల్‌ను మండలాల టీడీపీ నాయకులు యథేచ్ఛగా దోచుకుని అక్రమంగా సంపాదించుకుంటున్నారు. ఎర్రచందనంపై ఆ పార్టీ శ్రేణుల కళ్లు పడ్డాయి. గత అక్టోబర్ నెలలో సోమశిల పెన్నానది పరీవాహక ప్రాంతంలో కొందరు స్మగ్లర్లు టీడీపీ నాయకుల అండదండలతో ఎర్రచందనం, అటవీ సంపదను రాత్రికి రాత్రే దూర ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా కొందరు అధికారుల అండదండలతో తొక్కి పెట్టేశారు. తొలుత ఎర్రచందనం నరికి అనుకూలమైన ప్రాంతాల్లో డంప్ చేసుకుంటున్నారు. అవకాశం చూసి చైన్నె, బెంగళూరులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
వారిలో టీడీపీ నేత
ఇటీవల ఉదయగిరి ప్రాంతంలో పట్టుబడిన ఎర్రచందనం డంప్ విషయంలో అధికారులు ఆరా తీశారు. దీంతో వీటి వెనుకున్న వారు వెలుగులోకి రావడం, అరెస్ట్ చేయడం తెలిసిందే. మంత్రి ఆనం ప్రధాన అనుచరుడు, సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వేలూరు కేశవ చౌదరికి కుడిభుజంగా వ్యవహరించే ఆయన గ్రామానికే చెందిన తాళ్లూరు తిరుపతి నాయుడు పట్టుబడిన ఆరుగురిలో ఒకడు. ఎర్రచందనంను దూర ప్రాంతాలకు తరలించి రూ.లక్షలు వెనుకేసుకుంటున్నాడు. వీరికి మంత్రి అండదండలు ఉన్నాయని, వారికేమవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత నెలలో సంక్రాంతి పండగ సమయంలో నాగులవెలటూరు శివారు పొలాల్లో అధికారుల సమక్షంలోనే పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించడం, భారీగా నగదు చేతులు మారిన విషయం మరువక ముందే ఎర్రచందనం అక్రమ రవాణా బయటపడింది.
వెలుగులోకి ఇలా..
ఉదయగిరి నియోజకవర్గం ఆర్లపడియ, భైరవానికొండ తదితర ప్రాంతాల్లో గొర్రెలకాపరులు ఎక్కువగా ఉంటారు. కొద్దిరోజులుగా గొర్రెలు చోరీకి గురవుతుండడంతో కొందరు యజమానులు ఆర్లపడియ గ్రామ సమీపంలో రాత్రి వేళల్లో కాపలా ఉన్నారు. అదే సమయంలో రెండు వ్యాన్లలో కొందరు ఆ మార్గంలో అడవిలోకి ప్రవేశించిన విషయాన్ని గమనించిన యజమానులు వారు గొర్రెలు దొంగతనం చేసేందుకు వచ్చారనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రాత్రి పోలీసులు భైరవానికొండ సమీపంలోని కాశీనాయన ఆశ్రమం వద్ద దాడులు నిర్వహించి 30 ఎర్రచందనం దుంగలు వ్యాన్లలోకి లోడ్ చేస్తున్న విషయాన్ని గమనించారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు, టీడీపీ నాయకులు పరారయ్యారు. వారిలోని ఓ వ్యక్తి ఫోన్ అక్కడ దొరికింది. దాని ఆధారంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడే వారి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. ఫోన్ యజమాని ద్వారానే మిగిలిన వారికి కాల్ చేయించి నెల్లూరు సమీపంలోని నరసింహకొండ వద్దకు వారందరూ వచ్చేలా చేసి అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఉదయగిరి, బుచ్చి, నెల్లూరు, చేజర్ల మండలాలకు చెందిన ఆరుగురు పట్టుబడ్డారు. ముఖ్యమైన వ్యక్తి తాళ్లూరు తిరుపతి. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణా వెలుగులోకి వచ్చి టీడీపీ నాయకుల పాత్ర తెలిసింది. తిరుపతి గతంలో గుంటూరులో క్వారీలు నిర్వహించి పూర్తిగా నష్టపోయాడు. కుటుంబం బెంగళూరులో ఉంటోంది. అతను గ్రామంలో టీడీపీ నాయకుడికి అనుచరునిగా కొనసాగుతున్నాడు. ఆరు నెలలుగా ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రముఖపాత్ర పోషిస్తున్నట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది.
ఎంత దాటించారో..
పట్టుబడిన 30 దుంగల ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటుందని అటవీ శాఖ అధికారులే చెప్పడం గమనార్హం. ఇలా పట్టుబడకుండా మరెంత ఎర్రచందనం రాష్ట్రాలు దాటించి ఉంటారనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.
తమ్ముళ్ల కన్ను


