గళమెత్తిన కార్మిక లోకం
● నెల్లూరులో సార్వత్రిక సమ్మె
● భారీ ర్యాలీ నిర్వహించిన ప్రజా సంఘాలు, యూనియన్లు
● సంఘీభావంగా బైక్ ర్యాలీ చేపట్టినవైఎస్సార్ ట్రేడ్ యూనియన్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, అఖిల భారత సంయుక్త కిసాన్‌మోర్చా పిలుపుమేరకు గురువారం నెల్లూరులో కార్మిక లోకం సమ్మె నిర్వహించింది. ఉదయం ఏబీఎం కాంపౌండ్ వద్దకు చేరుకున్న సీపీఎం, సీపీఐ, నెల్లూరు నగర, రూరల్ కమిటీలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్‌టీయూ (న్యూ), ఏఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, వైఎస్సార్ టీయూ, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు, కా ర్మికులు మద్రాస్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండాల చేతపట్టి నాలుగు లేబర్‌కోడ్స్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
నేతలు ఏమన్నారంటే..
ర్యాలీ అనంతరం మద్రాస్ బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లా డుతూ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఐక్యత లేకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా పార్లమెంట్‌ను ఇంటిలా వాడుకుంటూ ఇష్టారాజ్యంగా చట్టాలు చేస్తోందని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను మార్చడం, ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మోదీ, చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి మాట్లాడుతూ కార్మికుల కోసం తెచ్చిన 29 చట్టాలను తిరిగి పునరుద్ధరించాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజయ్‌కుమార్ మాట్లాడుతూ నెల్లూరులోని ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందన్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లోకి ఆర్టీసీ వెళ్తుందన్నారు. సమ్మెలో వివిధ సంఘాలకు చెందిన రాజేష్, జయకుమార్‌రెడ్డి, రాజేష్, పరంధామయ్య, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు, రెహానా బేగం, అన్నపూర్ణమ్మ, మూలం ప్రసాద్, రషీద్, నరిసింహ, వినోదిని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు అండగా వైఎస్సార్‌సీపీ
నెల్లూరు రూరల్: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సమ్మెకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో జెండా ఊపి సీనియర్ నాయకుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ కార్మికులకు అండగా ఉంటుందని జయకుమార్‌రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, నేతలు పాల్గొన్నారు.
గళమెత్తిన కార్మిక లోకం


