లడ్డూ ప్రసాదంపై అదే దుష్ప్రచారం
● చంద్రబాబు తీరుపై అసహనంగా ప్రజలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు అదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో గురువారం పర్యటించిన ఆయన మాట్లాడారు. లడ్డూ ప్రసాదంపై చేస్తున్న వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి ఇలాంటి దుష్ప్రచారాలు సాగించడం తగదని హితవు పలికారు. గ్రామాల్లో ఎక్కడికెళ్లినా చంద్రబాబు వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించే ప్రసాదాలపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భక్తుల మనోవేదనను అర్థం చేసుకోకుండా ఇలా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని తేలడంతో.. అసహనంతో పేట్రేగిపోయి బాత్రూమ్‌లు కడిగే రసాయనాలను వాడారంటూ ఆయన మాట్లాడుతుండటాన్ని ఆ పార్టీ నేతలే చీదరిస్తున్నారని చెప్పారు. పాపాలు శాపాలుగా మారడంతో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, మంత్రులు నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కుట్రలను వెంకటేశ్వరస్వామి బద్ధలు కొట్టారన్నారు.
శివదీక్షధారులపై దాడులు హేయం
శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు నిష్టతో వెళ్లిన శివదీక్షధారులను పోలీసులు కొట్టడం హేయమైన చర్యగా కాకాణి అభివర్ణించారు. వెంకటాచలం మండలంలోని కాకుటూరు శివాలయ భూములను సోమిరెడ్డి విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. గ్రామాల్లో రైతుల గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. దేన్నీ అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ పవిత్రంగా ఉండేదని గుర్తుచేశారు. బ్రాహ్మణపల్లికి చెందిన పార్టీ సీనియర్ నేత రావుల చినఅంకయ్య దశదిన కర్మకు హాజరై నివాళులర్పించారు. వెన్నపూస దయాకర్‌రెడ్డి, బడుగు శ్రీనివాసులు, శ్రీహరి, గోపాల్‌నాయుడు, బత్తల పెంచలరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


