నిబంధనలను పాటించని డ్రైవింగ్ స్కూళ్లు
● జిల్లాలో డ్రైవింగ్ స్కూల్‌ను నిర్వహించాలంటే తొలుత రవాణా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
● ఎల్‌ఎమ్వీ స్కూల్‌కు కనీసం ఎకరా స్థలం ఉండాలి.
● ఇన్‌స్ట్రక్టర్‌కు డిప్లొమాతో పాటు డ్రైవింగ్‌లో ఐదేళ్ల అనుభవం తప్పనిసరి.
● ట్రేడ్‌మార్కును నమోదు చేసుకోవడంతో పాటు ఎమ్మెస్సెమ్‌ఈ, బీమా పాలసీ, పాన్‌తో పాటు సంబంధిత రవాణా శాఖ కార్యాలయం నుంచి డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ లైసెన్స్ పొందాలి.
● డెమో కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలి.
● డ్రైవింగ్‌కు సంబంధించిన మెళకువలను వారం పాటు వివరించాల్సి ఉంటుంది.
● రోడ్డు నిబంధనలు, సూచిక బోర్డులపై అవగాహన కల్పించాల్సి ఉంది.
● అనంతరం కనీసం 21 రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
కారును కొనుగోలు చేసి దర్జాగా నడపాలని చాలా మంది
కోరుకుంటారు. ఇందులో భాగంగా డ్రైవింగ్ నేర్చుకోవడం
తొలి ఎత్తు. ఔత్సాహికుల్లో ఉన్న ఈ ఆసక్తిని డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. నిబంధనలను పాటించకుండా.. జిల్లాలో పుట్టగొడుగుల్లా ఇవి వెలుస్తున్నాయి. జిల్లాలో కేవలం 15 స్కూళ్లకే అనుమతి ఉండగా, ఇవి లేకుండా ఎన్నింటినో అనధికారికంగా నిర్వహిస్తున్నారు. పాత వాహనాల్లో అరకొరగా ట్రెయినింగ్ ఇస్తూ.. కనీసం డెమోను సైతం
ఇవ్వకుండా నేరుగా డ్రైవింగ్‌లో కూర్చోబెడుతున్నారు. శిక్షణ.. లైసెన్స్‌ల పేరిట భారీగా వసూలు చేస్తున్నారు. ఈ రకంగా నేర్చుకొని టెస్ట్‌కు హాజరవుతున్న వారిలో కేవలం ఐదు శాతం మందే పాస్ అవుతుండటం.. శిక్షణ కేంద్రాల డొల్లతనాన్ని ఇట్టే బయటపెడుతోంది. ఇంత జరుగుతున్నా, చోద్యం చూడటం రవాణాధికారుల వంతవుతోంది.
నెల్లూరు (టౌన్): జిల్లాలో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు నాణ్యమైన శిక్షణను అందించడంలో దారి తప్పుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, కాలం చెల్లిన వాహనాల్లోనే శిక్షణ ఇస్తూ వేలాది రూపాయలను దోచుకుంటున్నారు. ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా డెమో ఇచ్చాకే.. వాహనాన్ని నడపడంలో ట్రెయినింగ్‌ను ఇవ్వాల్సి ఉన్నా, అవేవీ తమకు పట్టదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారి వద్ద రూ.ఐదారు వేలను వసూలు చేసి తూతూమంత్రంగా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.
అన్నీ మేమే చూసుకుంటాం..!
లైసెన్స్ కావాలంటే మరో రూ.మూడు వేలను చెల్లిస్తే, అన్నీ తామే చూసుకుంటామనీ భరోసా ఇస్తున్నారు. తీరా దీని కోసం రవాణా కార్యాలయానికెళ్తే బొక్కాబోర్లపడి ఫెయిలవుతున్న పరిస్థితీ నెలకొంది. జిల్లాలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అందుబాటులోకి వచ్చాక, లైట్ మోటార్ వెహికల్ టెస్ట్‌లో కేవలం ఐదు శాతం మందే ఉత్తీర్ణులవుతున్నారు. డ్రైవింగ్‌లో నిర్వాహకులు ఏ మేరకు శిక్షణ ఇస్తున్నారో దీని ద్వారా అర్థమవుతోంది.
పాత వాహనాల్లోనే అంతా..
జిల్లాలో అధికారికంగా 15 డ్రైవింగ్ స్కూళ్లుండగా, అనధికారికంగా 60కుపైగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కడా అధునాతన వాహనాలు కానరావు. అంబాసిడర్, మారుతి 800 లాంటి వాహనాల్లోనే శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో ఒకట్రెండు చోట్లే డెమో తరగతుల కోసం పరికరాలున్నాయి. ఓ చిన్న గదిలో సైతం నిర్వహిస్తున్న పరిస్థితీ ఉంది. ఇన్‌స్ట్రక్టర్‌కు లైసెన్సే ఉండదు. ఆ సమయంలో ఎవరుంటే వారినే శిక్షణకు పంపుతున్నారు. తొలి రోజు నుంచే నేరుగా స్టీరింగ్ పట్టించి.. డ్రైవింగ్‌ను కేవలం పది రోజుల్లోనే ముగిస్తున్నారు.
జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వైనం
అనుమతున్నవి 15.. పర్మిషన్ లేనివెన్నో..!
పాత వాహనాలతోనే
అరకొరగా ట్రెయినింగ్
డెమో ఇవ్వకుండా నేరుగా డ్రైవింగ్
తర్ఫీదు పేరుతో రూ.ఐదారు వేల చొప్పున వసూలు
లైసెన్స్‌తో కలిపి రూ.ఎనిమిది వేలు
పట్టించుకోని రవాణాధికారులు
ఇవీ నిబంధనలు..
ఇదీ తీరు..
తనిఖీలు నిర్వహిస్తాం
జిల్లాలోని డ్రైవింగ్ స్కూళ్లపై తనిఖీలు జరుపుతాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్యలు చేపడతాం. డెమో నిర్వహించిన అనంతరమే డ్రైవింగ్‌ను నేర్పించాలి. అనధికారికంగా నిర్వహిస్తే చర్యలు తప్పవు.
– మదానీ, ఆర్టీఓ, నెల్లూరు
నిబంధనలను పాటించని డ్రైవింగ్ స్కూళ్లు


