గిరిజనులపై కూటమి చిన్నచూపు
● కొనసాగుతున్న
రిలే నిరాహార దీక్షలు
నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై చిన్నచూపు చూస్తోందని పలువురు నాయకులు మండిపడ్డారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు రాష్ట్ర స్థాయి నేతలు మంగళవారం హాజరై మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గత ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మాజీ మేయర్ పొట్లూరి స్రవంతికి జరిగిన అన్యాయాన్ని సహించేది లేదన్నారు. దీనిపై త్వరలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీలో పెద్దలను కలిసి అన్యాయాన్ని వివరిస్తామన్నారు. బడుగు, బలహీనవర్గాలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యందేటి వెంకటసుబ్బయ్య, కోశాధికారి రాపూరి ప్రభావతి, గౌరవాధ్యక్షుడు కేవీ ప్రసాద్, ఇంకా చౌటూరి రమేష్, కొమరగిరి సూరిబాబు, పట్రా సుబ్రహ్మణ్యం, యందేటి సురేంద్ర, కొమరగిరి మరియమ్మ, గంధళ్ల నరేష్, రాపూరి గోపీ, పొట్లూరి అశోక్, అల్లురమ్మ, తిరుపతిరావు, బత్తుల లక్ష్మణశేఖర్, తలపల జై వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


