ఎండిన ఆశలు | - | Sakshi
Sakshi News home page

ఎండిన ఆశలు

Feb 14 2026 9:58 AM | Updated on Feb 14 2026 9:58 AM

ఎండిన

ఎండిన ఆశలు

మడిలో పగుళ్లు.. కర్షకుడి కళ్లల్లో కన్నీళ్లు

ఎగువన సోమశిల, కండలేరు జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు. దిగువన పొలాల్లో నీళ్లు లేక వెయ్యి ఎకరాల్లో అన్నదాతల ఆశలు ఎండిపోతున్నాయి. మడి మడిలో పగుళ్లు కర్షకుడి కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసినా.. సోమశిల దక్షిణ కాలువ పరిధిలోని 7 ఆర్‌ ఉప కాలువలో తట్టడు మట్టి తీసిన పాపాప పోలేదు. ఈ కాలువ కింద సుమారు 3 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతోంది. కాలువలో జమ్ము, నాచు, చిల్లచెట్లు పెరిగిపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరందక సుమారు వెయ్యి ఎకరాల్లో పచ్చని వరి పైరు ఎండిపోతోంది. ఎన్నెన్నో ఆశలతో సాగు చేసిన వరి కళ్ల ముందే ఎండిపోతుంటే అటు పాలకులు కానీ.. ఇటు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.

పొదలకూరు : పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి వెరసి వెయ్యి ఎకరాల్లోని వరి పంటకు శాపంగా మారింది. రైతుల పేరుతో కాలువల మరమ్మతులకు రూ.కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారు. కానీ ఎక్కడా తట్టెడు పూడిక తీయలేదంటూ ఆది నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేసిన ఆరోపణలకు సోమశిల దక్షిణ కాలువ పరిధిలోని 7ఆర్‌ ఉప కాలువ అద్దంపడుతోంది. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వరి పంట ఎండుపోతున్నా.. పాలకులు, అధికారులు కన్నెత్తి చూడడం లేదని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. రూ.కోట్ల నిధులు మంజూరు చేయించుకుని కాలువల నిర్వహణను గాలికి వదిలేయడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగునీటికి తప్పని యుద్ధం

సోమశిల జలాశయం నిండుకుండలా ఉన్నా దిగువనున్న ఆయకట్టు రైతులు మాత్రం సాగునీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సోమశిల దక్షిణ కాలువ, దాని ఉప కాలువల కింద చివరి ఆయకట్టు రైతులు జలాశయంలో నీటి నిల్వలు, నీటి కేటాయింపులను దృష్టిలో ఉంచుకుని సుమారు వేలాది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ప్రధానంగా 7 ఆర్‌ ఉపకాలువ కింద సుమారు 3 వేల ఎకరాల్లో వరి సాగులో ఉంది. రెండు వారాల క్రితం వరకు నీటిని సరఫరా చేసిన అధికారులు ఆ తర్వాత క్రమంగా తగ్గించడంతో మండలంలోని చివరి ఆయకట్టుగా ఉన్న చెన్నారెడ్డిపల్లి, నావూరు, భోగసముద్రం, బత్తులపల్లి, చేజర్ల మండలం కొండలరాయుడకండ్రిక రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టులో సుమారు వెయ్యి ఎకరాలకు చుక్కనీరు పారుదల లేక నెర్రిలు బారాయి.

నిలువునా ఎండుతున్న పంటలు

కాలువలో జమ్ము, నాచు, కంపకర్ర చెట్లు పెరగడంతో పూడికతో నిండిపోయి నీరు సక్రమంగా అందడం లేదు. దీనికితోడు మధ్యలో చేజర్ల మండలం చీర్లవారికండ్రిక వద్ద కాలువ పరిస్థితి దయనీయంగా ఉంది. జమ్ము దట్టంగా పెరగడంతో విడుదల చేసిన సాగునీరు ముందుకు సాగడం లేదు. సాగు నీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. చాలా చోట్ల కాలువకు షట్టర్లు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారిందని రైతులు అంటున్నారు. చివరి ఆయకట్టులో వెయ్యి ఎకరాలకు తీవ్రంగా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు మాత్రం గతేడాది రెండో పంటకు నీరు అందజేయడం వల్ల కాలువల మరమ్మతులు చేపట్టలేకపోయినట్టు చెబుతున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని, పారుదల కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలకుల నిర్లక్ష్యం..

వెయ్యి ఎకరాల్లో వరికి నష్టం

సర్వేపల్లిలో కాలువల

అభివృద్ధికి రూ.కోట్లల్లో ఖర్చు

అయినా జమ్ము, నాచుతో

పూడిన 7ఆర్‌ కాలువ

చివరి ఆయకట్టుకు పారని సాగునీరు

కాలువల నిర్వహణను

గాలికొదిలేసిన అధికారులు

పంటను కాపాడాలని

వేడుకుంటున్న రైతులు

ఎండిన ఆశలు 1
1/1

ఎండిన ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement