సినిమా అవకాశం పేరిట మోసం
● ఎస్పీకి ఫిర్యాదు
● పోలీస్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 146 వినతులు
నెల్లూరు(క్రైమ్): సినిమాలో అవకాశం, ఉద్యోగాల పేరిట మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 146 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్ల, పోలీసు అధికారులకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ చట్టపరిధిలో సత్వరమే సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళా పోలీసుస్టేషన్, పీసీఆర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన చక్రధర్‌రెడ్డి తాను తీయబోయే సినిమాలో హీరో తమ్ముడు క్యారెక్టర్ ఇస్తానని నా కుమారుడిని నమ్మించి రూ.1.06 లక్షలు నగదు తీసుకుని మోసగించాడు. విచారించి న్యాయం చేయాలని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వివాహిత కోరారు.
● విజయ్ శాంసన్, ప్రతాప్, మధు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నాతోపాటు మరికొందరి వద్ద రూ.15 లక్షలు నగదు తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పించకుండా నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని బాలాజీ నగర్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● దుబాయిలో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ రూ.4.50 లక్షలు నగదు తీసుకున్నాడు. విజిటింగ్ విసా కింద అక్కడికి పంపి మోసగించాడు. విచారించి చర్యలు తీసుకోవాలని కోటకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.
● కోడలు, మనుమడు బాగా చూసుకుంటానని నమ్మించి నా ఇళ్లు, పొలం వారి పేరుపై రాయించుకున్నారు. అనంతరం ఇంట్లో నుంచి తరిమేశారు. నాకు జీవనాధారం కష్టంగా ఉంది. న్యాయం చేయాలని కలిగిరికి చెందిన ఓ వృద్ధురాలు వినతిపత్రమిచ్చారు.
● నా కుమారుడు గతేడాది అక్టోబర్ నుంచి కనిపించడం లేదు. విడవలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ వేగవంతం చేసి కుమారుని ఆచూకీ తెలుసుకుని అప్పగించాలని విడవలూరుకు చెందిన ఓ మహిళ కోరారు.
● నన్ను, నా పిల్లలను ఇంట్లోకి రానివ్వకుండా భర్త, అత్తింటివారు ఇబ్బందులు పెడుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబాన్ని చక్కదిద్దాలని బాలాజీనగర్‌కు చెందిన ఓ వివాహిత అర్జీ అందించారు.


