అయ్యో.. గోమాత
● ఆకలితో అలమటిస్తూ.. బక్కచిక్కి
● వెంగమాంబ పేరంటాలమ్మ
ఆలయ గోశాలలో ఇదీ దుస్థితి
దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మండలంలోని నర్రవాడ వెంగమాంబ పేరంటాలమ్మ ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులను దేవస్థానాధికారులు, సిబ్బంది పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గోవులు, కోడె దూడలు కలిపి సుమారు 40 ఉన్నాయి. గోశాలలో కొన్ని నెలలుగా గడ్డి నిల్వ లేకపోవడంతో ఇవి ఆకలితో అలమటిస్తున్నాయి. పచ్చిక బయళ్లు సైతం కరువై అనారోగ్యానికి గురవుతున్నాయి. ఫలితంగా చెత్తాచెదారాన్ని తినాల్సి వస్తోంది. కాగా ఈ విషయమై ఆలయ ఇన్‌చార్జి ఈఓ శ్రీనివాసరెడ్డిని సంప్రదించగా, గడ్డి కొరత తీవ్రంగా ఉందని, ఎక్కడ తిరిగినా దొరకడంలేదని చెప్పారు. గడ్డిని రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు చేసేలా చూస్తామని బదులిచ్చారు.


