విచారణలు, నివేదికలు బుట్టదాఖలు | - | Sakshi
Sakshi News home page

విచారణలు, నివేదికలు బుట్టదాఖలు

Feb 14 2026 9:58 AM | Updated on Feb 14 2026 9:58 AM

విచార

విచారణలు, నివేదికలు బుట్టదాఖలు

జిల్లా ఇరిగేషన్‌ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. పారుదల కాలువల అభివృద్ధి పేరిట అక్రమార్కులు కల్పతరువుగా మార్చుకున్నారు. పైసా పని చేయకుండానే రూ.కోట్లల్లో నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ కమిటీలు సైతం అవినీతిని ధ్రువీకరించినా.. అక్ర మార్కులపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవంటే ఈ శాఖలో ఏ స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందో అర్థం చేసుకోవచ్చు. కూటమి అధికారంలోకి రాగానే అవినీతిపరులనే ముద్రపడిన కొందరు అధికారులను దొడ్డిదారిన డిప్యుటేషన్‌పై ఈ శాఖలో ఉన్నతస్థాయిలో కూర్చొబెట్టి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. విషయం రచ్చకెక్కినప్పుడు తాత్కాలికంగా పంపించడం, రోజుల వ్యవధిలోనే మళ్లీ పట్టం కట్టబెట్టడం రివాజుగా మారింది.

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరులోని నీటి పారుదల శాఖ.. అవినీతి పారుదల శాఖగా అవతరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శాఖలో కొందరు అధికారులు, ఉద్యోగులే అన్నీ తామై కీలకంగా వ్యవహరిస్తూ.. ఈ శాఖను భ్రష్టుపట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్లు చేయని ఉద్యోగులు, అధికారులను డిప్యుటేషన్‌పై ఇతర దూర ప్రాంతాలకు నిర్దయగా బదిలీ చేయడం నుంచి ఇష్టారీతిన బిల్లులు పాస్‌ చేసుకునే వరకు సంబంధిత అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారంటూ ప్రతిపక్షం ఆధారాలతో సహా బట్టబయలు చేస్తున్నా.. చలనం లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి పని తమ కనుసన్నల్లో జరిగేలా అధికార పార్టీ ముఖ్యనేతలు వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ప్రధానంగా గతేడాది మోంథా తుఫాన్‌ ప్రభావంగా వరదలకు చాలా చోట్ల ఇరిగేషన్‌ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా కాలువలు, గండ్లు పూడ్చేందుకు తాత్కాలికంగా రూ.100 కోట్ల నిధులు మంజూరైతే.. ఆ నిధులన్నీ ఆవిరైపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా పనులు ఏ నియోజకవర్గంలో ఎక్కడ మంజూరయ్యాయో తెలియని చిదంబర రహస్యంగా మారుతోంది. తమ ప్రాంతాల్లో ఏఏ పనులు.. ఎంత అంచనాలతో చేస్తున్నారు.. ఎంత మేరకు పనులు జరిగాయో తెలపాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులు దరఖాస్తు చేసినా.. సరైన సమాచారం ఇవ్వకుండా చట్టధిక్కారానికి సైతం పాల్పడుతున్నారంటే.. ఏ స్థాయిలో వీరు బరితెగిస్తున్నారో అర్థమవుతోంది.

ఐఏబీల్లో ఆర్భాటపు ప్రకటనలు..

పనుల్లో అక్రమాలు

జిల్లాలో ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్‌ పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆధారాలతో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బట్టబయలు చేసినా.. సంబంధిత పనులపైనా.. అధికారులపైనా కనీస విచారణ జరిపి చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. రైతులకు ఉపయోగకరంగా చేపట్టాల్సిన పనులను ధనార్జనే ధ్యేయంగా తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుని, రూ.కోట్లు దిగమింగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏబీ మీటింగ్‌ల్లో తీర్మానించిన తీర్మానాలు ఇంత వరకు ఒక్కటీ కూడా పూర్తి కాలేదు. నియోజకవర్గానికి కేటాయించిన పనుల వివరాలు కూడా చెప్పేవారు కరువయ్యారు. అధికార పార్టీ ముఖ్యనేతల ప్రమేయంతో ఆ శాఖ ఉద్యోగులు ఎలా పనిచేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

అటు తప్పించి.. ఇటు కూర్చోబెట్టి

గంగాధర్‌ అనే ఉద్యోగి కాంట్రాక్టర్ల నుంచి ఫోన్‌పే ద్వారా డబ్బులను అక్రమంగా తీసుకున్నారంటూ పక్కా ఆధారాలతో ఆరోపణలు వెల్లువెత్తడంతో అతనిపై చర్యలు చేపట్టకుండా కొన్ని రోజులు తప్పించి, మళ్లీ ఇప్పుడు విధుల్లోకి తీసుకొచ్చారనే విమర్శలు లేకపోలేదు. గంగాధర్‌, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యుల ఖాతాల్లో డబ్బులను అక్రమంగా జమ చేశారనే పూర్తి ఆధారాలున్నా చర్యలను ఎందుకు చేపట్టలేదనే ప్రశ్నలకు ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద సమాధానం దొరకడం లేదు. అక్రమాలకు అడ్డాగా మారిన ఇరిగేషన్‌ శాఖలో అవినీతి జలగలపై విజిలెన్స్‌, ఏసీబీ శాఖలు కనీసం విచారణ చేపట్టకపోవడం వెనుక అధికార పార్టీ ముఖ్య నేతల ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం.

అక్రమార్కుల పాలిట

కల్పతరువు

రూపాయి పనిచేయకుండానే

రూ.కోట్లల్లో ప్రజాధనం దోపిడీ

కూటమి ప్రభుత్వం రాగానే అవినీతి అధికారులకు డిప్యుటేషన్‌పై అందలం

వీరిని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న ప్రజాప్రతినిధి, కొందరు నాయకులు

ఆరోపణలు, విచారణ కమిటీలు.. వీరి ముందు బలాదూర్‌

ఏ విచారణ నివేదికపైనా

చర్యలు శూన్యం

సంబంధిత అధికారులను తాత్కాలికంగా వెనక్కి పంపడం.. మళ్లీ దొడ్డిదారిన తెచ్చి కూర్చోబెట్టడం రివాజు

నివ్వెరపోతున్న ఉద్యోగులు

అనైతిక కార్యకలాపాలకు అడ్డా

ఇరిగేషన్‌ శాఖ అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఒక డీఈఈ స్థాయి అధికారి అక్కడ పనిచేసే ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడితే చర్యలు చేపట్టలేదు. పది రోజులు ఆయన్ను పక్కన బెట్టి మళ్లీ అదే సీటులో కూర్చోబెట్టారు. సదరు డీఈఈ వేధింపులకు గురైన మహిళే ఆయన మీద ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో ఆయన్ను మళ్లీ విధుల్లో కూర్చొబెట్టుతూ ఉత్తర్వులు ఇచ్చారంటే ఇంతకంటే దౌర్భగ్యం మరొకటి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి అధికారులు, అక్రమార్కులతోపాటు అధికార పార్టీ ముఖ్యనేతకు ఆ శాఖ ఉన్నతాధికారి కొమ్ముకాస్తూ ఇరిగేషన్‌ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇరిగేషన్‌ శాఖలో జరుగుతున్న తీరుపై ఆ శాఖ ఉద్యోగులే నివ్వెరపోతున్నారు.

ఇరిగేషన్‌ శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులకు అధికార పార్టీ ముఖ్య నేతల అండదండలు ఉండడంతో అవినీతి ఆరోపణలు వచ్చినా ఏ మాత్రం పట్టించుకోకుండా యథావిధిగా పనిచేస్తున్నారు. ఇటీవల సెంట్రల్‌ డివిజన్‌ మేనేజర్‌పై ఏకంగా విచారణకు ఆదేశించినా అవినీతి అక్రమాలపై విచారణ పూర్తి కాకుండానే క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ ఆయన్ను సరెండర్‌ చేశారు. మళ్లీ వెంటనే విచారణ నిర్వహించామని, ఆయనపై ఆరోపణలేవీ లేవంటూ విచారణలు, నివేదికలు బుట్టదాఖలు చేశారు. క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఎంతో కచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఏ పని ఏ స్థాయిలో చేశారో చెప్పాల్సిన క్వాలిటీ కంట్రోల్‌ ఉద్యోగుల్లో ఇలా ఒకరినొకరు వెనుకేసుకొస్తూ పనుల క్వాలిటీనే పక్కదారి పట్టిస్తున్నారంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

విచారణలు, నివేదికలు బుట్టదాఖలు 
1
1/1

విచారణలు, నివేదికలు బుట్టదాఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement