రోడ్లు గుల్లగుల్ల..
టీడీపీ నేతలు బరితెగించారు. తమ ధన దాహం తీర్చుకునేందుకు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. జిల్లాకే వరప్రసాదిని అయిన జలనిధిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అనేక గ్రామాలకు వెళ్లే రహదారుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే అడ్డుకునే అధికారి లేరు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్ల మత్తులో జోగుతూ పచ్చపార్టీకి సాగిలపడి సాష్టాంగం పడుతున్నారు. పచ్చపార్టీ నేతలు సాగిస్తున్న దాష్టీకాలను ప్రశ్నిస్తే.. కేసులు పెడుతామంటూ బెదిరిస్తున్నారు. భారీ వాహనాల్లో పరిమితికి మించి ఇసుక లోడ్ చేసి రవాణా చేస్తుండడంతో రోడ్లు ఎక్కడికక్కడ మోకాల్లోతున కుంగిపోవడంతో కనీసం నడిచేందుకు కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది. రహదారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ తమ సర్వీసులను రద్దు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలకు కి.మీ. మేర నడక తప్పడం లేదు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ పాలకుల ధనదాహానికి రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రహదారులు విధ్వంసమవుతున్నాయి. వీరి దాష్టీకానికి ప్రజలు నరకయాతనలు అనుభవిస్తున్నారు. జిల్లా ప్రజలు, రైతాంగం భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నా.. పర్యావరణాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగిస్తున్నా.. ఇసుక దందాను ఆపే దమ్ము జిల్లా అధికార యంత్రాంగానికి లేదని విస్పష్టమవుతోంది. అనధికార రీచ్‌లు ఏర్పాటు చేసుకుని రేయింబవళ్లు బహిరంగంగానే ఇసుక దోపిడీ చేస్తున్నా.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారుల వెంబడే ఇసుక వాహనాలు వెళ్తున్నా.. కట్టడి చేయలేక.. చావ కోల్పోయి చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ పాలన ప్రజలకు కంఠకంగా మారింది. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వెనుక ఉండి బినామీలతో నడిపిస్తున్న ఇసుక దందా.. పెన్నా తీరంలోని గ్రామాలతో పాటు ఆయా మార్గాల్లోని గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. భారీ వాహనాలతో పరిమితికి మించి అక్రమంగా సాగిస్తున్న ఇసుక దందాలకు పదికాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రహదారులు గుల్లగుల్లగా మారుతున్నాయి.దండుగా వస్తున్న ఇసుక టిప్పర్లతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్న పరిస్థితి. అనుమతి లేని రీచ్ నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్ ఢీకొని ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ కేసులో అనామకుడిని అరెస్ట్ చేసి.. అసలైన నిందితులను వదిలేశారు. భారీ ఇసుక టిప్పర్లతో రహదారులు దెబ్బతింటున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా.. రోడ్లు విధ్వంసం అవుతున్నా.. అధికార యంత్రాంగాలకు పట్టడం లేదు.
ఎన్‌జీటీ ఆదేశాలు తుస్
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలను తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల ఆదేశాలే చట్టాలుగా మార్చేసి యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. ఇటు పర్యావరణాన్ని పణంగా పెట్టి సోమశిల ప్రాజెక్ట్‌కు దిగువన వందల మీటర్ల దూరంలోనే పెన్నానదిలో 20 నుంచి 30 అడుగుల మేర తవ్వేస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో ప్రాజెక్ట్ మనుగడకు ప్రమాదం తప్పదని పర్యావరణ హితులు హెచ్చరిస్తున్నారు. ఇక రైతులకు సాగునీరు పాకుండా కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. కాలువలకు అడ్డంగా గట్టుకట్టి మరీ గ్రావెల్ వేసి రహదారులు నిర్మించి ఇసుక దందా కొనసాగిస్తున్నారు. భవిష్యత్ ప్రమాదాలను సైతం పట్టించుకోకుండా నిత్యం వేలాది టన్నులు ఇసుకను తోడేస్తూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగాలు మాత్రం సాగిల పడి అఽధికారానికి గులాంగిరీ చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు.
తెలుగురాయపురంలో బరితెగిస్తున్న తమ్ముళ్లు
భారీ వాహనాలతో ఇసుక అక్రమ రవాణా
అధిక లోడుతో రోడ్లు గుల్లగుల్ల
ప్రశ్నిస్తే కేసులంటూ బెదిరింపులు
ప్రజాప్రతినిధులకు
నెలకు రూ.కోట్లలో మామూళ్లు
పట్టించుకోని సంబంధిత
రహదారుల శాఖ
గుంతల రహదారిలో నడకే కష్టం
బైక్‌లు, ఆటోలు, కార్లు సైతం
వెళ్లలేని పరిస్థితి
ఆ మార్గంలోని పల్లెలకు
ఆర్టీసీ బస్సులు రద్దు
ప్రజలకు శాపంగా కూటమి పాలన
సోమశిలకు అతి సమీపంలో తెలుగురాయపురంలో ఇసుక రీచ్‌ను టీడీపీ నేతలు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ రీచ్ నుంచి రేయింబవళ్లు సుమారు వందల టిప్పర్ల ద్వారా వేల మెట్రిక్ టన్నుల ఇసుకను కుల్లూరు సమీపంలోని రాజుపాళెం వద్ద (నేషనల్ హైవే 565 పక్కన) డంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కర్ణాటక, చైన్నె ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిత్యం రీచ్ నుంచి వాహనాల్లో భారీగా లోడ్ చేసుకుని వెళ్తుండడంతో తెలుగురాయపురం నుంచి కొలవపల్లి, నూకనపల్లి, కలువాయి, బ్రాహ్మణపల్లి, వెంకటరెడ్డిపల్లి, కుల్లూరు వరకు రహదారి కొండలు, గుట్టలను తలపిస్తోంది. ఈ మార్గంలో బైక్‌లు, ఆటోలు కూడా నడిచే పరిస్థితి లేదంటే అతిశయోక్తి లేదు. భారీ టిప్పర్లు లోడ్ అధికమై రోజుకో చోట కుంగిపోయి ఇరుక్కుపోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలుగురాయపురం నుంచి కలువాయి రహదారి నరకాన్ని ప్రత్యక్షంగా చూపిస్తోంది. నాలుగు రోజుల క్రితం తెలుగురాయపురం రీచ్‌నుంచి వెళ్లే టిప్పర్ చక్రాలు కొలవపల్లి వద్ద రోడ్డు మార్జిన్‌లో కూరుకుపోయాయి. దీంతో ఆ రోడ్డు బ్లాక్ అవ్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ యంత్రాలు పెట్టి టిప్పర్‌ను బయటకు తీసి పంపారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన బీటీ రోడ్డు పచ్చముఠాల ధనదాహానికి విధ్వంసమవుతున్నాయి. ప్రజాజీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు.
రోడ్లు గుల్లగుల్ల..
రోడ్లు గుల్లగుల్ల..


