పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన బాట
● నేటి నుంచి డీసీసీ బ్యాంక్ వద్ద ధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలంటూ మూడు నెలల నుంచి వివిధ రూపాల్లో ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగులు (పీఏసీఎస్) నిరసన తెలుపుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని 78 పీఏసీఎస్‌ల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గురువారం నుంచి ఆందోళనను ఉధృతం చేయనున్నారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఎదుట ధర్నా చేపట్టనున్నారు. ఇప్పటి వరకూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం, విధులు బహిష్కరించడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రధాన డిమాండ్లు
జీఓ నంబర్ 36ను వెంటనే అమలు చేసి, 2019 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ చేయాలి. అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలి. పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. 2019 సంవత్సరం తర్వాత సహకార సంఘాల్లో చేరిన వారిని రెగ్యులర్ చేయాలి. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలి. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు రుణాలందించేలా చర్యలు తీసుకోవాలి. బదిలీలకు సంబంధించి 3 సంవత్సరాల నిబంధన ఎత్తివేయాలి. కెపాసిటీ టు పే నిబంధనకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతాలు డీఎల్‌ఎస్‌ఎఫ్ ద్వారా చెల్లించాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను డీఎల్‌ఈసీ ద్వారా భర్తీ చేయాలి.
కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఏల ధర్నా
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట బుధవారం వీఆర్‌ఏలు ధర్నా చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా గుర్తించాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల నుంచి వీఆర్‌ఏలకు ఒక్క రూపాయి వేతనం పెరగలేదన్నారు. నామినీలుగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా గుర్తించకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా తీసుకెళ్లినా ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లచ్చయ్య, ఓబులేసు, సుబ్బయ్య, అంకయ్య, శ్రీను పాల్గొన్నారు.
పొలం ఆక్రమణకు యత్నం
నెల్లూరు రూరల్: అనంతసాగరం మండలం ఆమనిచిరువెళ్లలో కొనుగోలు చేసిన 11 ఎకరాల పట్టా భూమిని ఆత్మకూరు సీఐని అడ్డుపెట్టుకుని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అదే మండలానికి చెందిన వెంగంపల్లికి చెందిన బట్రెడ్డి రోసిరెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆమనిచిరువెళ్ల గ్రామానికి చెందిన గాలిబోయిన రమణయ్య, నాగేంద్ర, కిశోర్, మేకల అశోక్, వనిపెంట రమణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సర్పంచి శేషయ్య సదరు భూమిలో నాటిన ఫెన్సింగ్ రాళ్లను ఈనెల 5వ తేదీన ధ్వంసం చేశారన్నారు. గడ్డపారతో దాడికి యత్నించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఎస్సైకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. సీఐకు ఆధారాలు సమర్పించినా దాడి చేసిన వారితో కుమ్ముకై ్క చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తహసీల్దార్ చెప్పినా సీఐ పట్టించుకోవటం లేదని వాపోయారు. రక్షణ కల్పించాలని కోరారు.
పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన బాట


