రిలయన్స్‌కు భూములను ధారాదత్తం చేయొద్దు
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల అందోళన
● ప్రభుత్వ తీరుపై మండిపాటు
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను అభివృద్ధి ముసుగులో బడా కంపెనీలకు ధారాదత్తం చేస్తుండడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు కాకుండా కార్పొరేట్ కంపెనీలకు భూములను కట్టబెడుతుండడంపై స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. ఉదయగిరి మండలం పుల్లాయపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్లు 100,106లలో ఉన్న 312 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రిలయన్స్ కంపెనీకి స్వాధీనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సోమవారం పెద్ద సంఖ్యలో ఉదయగిరి తహసీల్ధార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి చెందిన భూములను రిలయన్స్ కంపెనీకి ఇచ్చి తమ కడుపు కొట్టొద్దని రెవెన్యూ అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఏమి జరిగిందంటే..
పుల్లాయపల్లిలోని సర్వే నంబర్లు 100,106లో ఉన్న 312 ఎకరాలు భూమిని సీలింగ్ ద్వారా ప్రభుత్వం తీసుకుంది. సదరు ప్రభుత్వ భూమిని 1992లో అప్పటి రెవెన్యూ అధికారులు గ్రామంలోని 242 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన నిరుపేద రైతులకు సీజేఎఫ్‌ఎస్ ద్వారా లీజు పట్టాలుగా పంపిణీ చేశారు. ఈ వివరాలను అధికారులు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయలేదు. భూములను పొందిన కొందరు రైతులు కొంత కాలం సాగు చేశారు. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించక సాగును నిలిపివేశారు. దీంతో భూముల్లో కంపచెట్లు పెరిగి చిట్టడవిలా మారింది. ఈ నేపథ్యంలో 2024లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం రిలయన్స్ కంపెనీకి 312 ఎకరాల సదరు ప్రభుత్వ భూమిని కేటాయించి స్వాధీనం చేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తుల కడుపుమండింది. ఏళ్ల తరబడి తాము చేసుకుంటున్న భూమిని తమకు కాకుండా రిలయన్స్ కంపెనీకి ఎలా కేటాయిస్తారంటూ రెవెన్యూ అధికారులను నిలదీశారు. దాదాపు 250 మందికి పైగా రైతులు ఉదయగిరి చేరుకుని రంగనాయకులస్వామి ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ షాజియాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయమ్మ, అఖిలపక్ష నేతలు కాకు వెంకటయ్య, కే నరసింహారెడ్డి, కల్లూరి కృష్ణారెడ్డి, కొండా రాజగోపాల్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ తీరు దుర్మార్గం
టీడీపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ, పేదలకు పంపిణీ చేసిన భూములను బడా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో కాలుష్యం పెరిగి ప్రజలు గ్రామాలను వదిలి వెళ్లే పరిస్థితి వస్తుంది. పుల్లాయపల్లిలో పేదలకు పంపిణీ చేసిన భూములను కాజేసే కుట్రలో భాగంగా రిలయన్స్‌కు చెందిన ఏబీసీ సంస్థ్ధకు కేటాయిస్తూ జీఓ ఇవ్వడం దుర్మార్గం. ప్రభుత్వం వెంటనే జీఓను వెనక్కితీసుకోపోతే పోరాటం చేస్తాం.
– కాకు వెంకటయ్య, జిల్లా రైతు సంఘ నేత
రిలయన్స్‌కు భూములను ధారాదత్తం చేయొద్దు
రిలయన్స్‌కు భూములను ధారాదత్తం చేయొద్దు


