కల్తీ పాపం చంద్రబాబుదే..
ప్రభుత్వ వైఫల్యమే..
● కోట్లాది మంది వెంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణలు చెప్పాలి
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: కల్తీ పాపం చంద్రబాబుదేనని, తిరుమల లడ్డూ విషయమై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని సిట్, సీబీఐతో కూడిన దర్యాప్తులో తేటతెల్లమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. లడ్డూ ప్రసాద అంశంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అందులో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడారని ఆరోపించారు. 2019, మార్చి 6న బోలే బాబా డెయిరీకి అనుమతిచ్చింది టీడీపీ నేతలేనని, అప్పట్లో ప్రభుత్వం సైతం వారిదని గుర్తుచేశారు. టెక్నికల్‌గా క్వాలిఫై అయిందనే తీర్మానాన్ని ఆమోదించింది చంద్రబాబు కాదానని నిలదీశారు. అదే రోజు సదరు డెయిరీకి 82 వేల కిలోల నెయ్యి ఆర్డర్ ఇచ్చిందీ వారేనన్నారు. అదే ఏడాది ఏప్రిల్ 19న టిన్నుల రూపంలో 12,300 కిలోలను సరఫరా చేయాలని చెప్పింది మీరు కాదానని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ అంశమై సమాధానం చెప్పాల్సిన ఆయన అలా చేయకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందంటూ దుర్మార్గమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తమ హయాంలో నిబంధనలతో కఠినంగా వ్యవహరించామే తప్ప ఎక్కడా పొరపాట్లు జరగనివ్వలేదని తెలిపారు. అసత్యాలు, ఆరోపణలు వారికే చుట్టుకున్నాయని తెలిపారు. కూటమి నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పి, లెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు దాడులు చేస్తూ.. అక్రమ కేసులను బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు.
గుమ్మళ్లదిబ్బలో బాలిక మృతి విషయంలో ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కాకాణి ధ్వజమెత్తారు. నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటళ్లుండగా, చైన్నెకి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇక్కడ వైద్యమందించి ఉంటే బాలిక బతికుండేదని వారి తల్లిదండ్రులే ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి వినియోగం ఎక్కువైందని, పల్లెల్లోకీ పాకి యువత పెడదారి పట్టి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెల్లోపే గంజాయిని నిర్మూలిస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు వాటిపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్తే అక్రమ కేసు పెట్టారన్నారు. పాలకులకో న్యాయం.. తమకో న్యాయమానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, పాలకుల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.


