రైతుల బాధలు వర్ణనాతీతం
● ధాన్యం ధరలపై ఇప్పట్నుంచే ఆందోళన
● యూరియా లభ్యం కాక ఇబ్బందులు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: టీడీపీ ప్రభుత్వంలో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయని, ధాన్యానికి మద్దతు ధరలు లభిస్తాయో లేదోననే ఆందోళనలో అన్నదాతలున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మొగళ్లూరు, మనుబోలు మండలంలోని కట్టువపల్లి, మడమనూరు, గొట్లపాళెం గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. యూరియా లభ్యం కావడం లేదని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అండగా నిలవాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. టీడీపీ నేతలు తమ ఇళ్లకు యూరియాను తరలించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇరిగేషన్ పనులను నిర్వహించకుండానే.. దొంగ బిల్లులను సోమిరెడ్డి చేయించుకుంటే ఆయన అనుచరులు యూరియాను బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పంటలకు మద్దతు ధరలను అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొక్కుబడిగా తెరిచి రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర కోసం రైతుల పక్షాన తమ పార్టీ పోరాటం చేయనుందని ప్రకటించారు.
కొత్త పింఛన్లు
మంజూరు కాక అవస్థలు
కొత్త పింఛన్లు మంజూరు కాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. అధికారులపై సోమిరెడ్డి మండిపడుతూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రెయిన్లను సంపూర్ణంగా నిర్మించామని, అయితే ప్రస్తుత సర్కార్ అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని రైతులు కాంక్షిస్తున్నారని చెప్పారు. మొగళ్లూరులో యనమల రమణారెడ్డి భౌతికకాయానికి నివాళుర్పించారు. మనుబోలు మండలంలో సన్నారెడ్డి జానకిరామిరెడ్డి, పసల శంకరయ్య, పద్మావతి, వెంకటేశ్వర్లును పరామర్శించారు. పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, రెడ్డిచర్ల అంకిరెడ్డి, యనమల శ్రీనివాసులురెడ్డి, ఆకుల గంగిరెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, గుండాల ఆదినారాయణ, సురేష్, రామచంద్రారెడ్డి, జనార్దన్‌రెడ్డి, బొమ్మిరెడ్డి హరిగోపాల్‌రెడ్డి, ముంగర రవీంద్రరెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, ఈగా సురేష్ తదితరులు పాల్గొన్నారు.


