పోలీసుల బెదిరింపులకు భయపడం
● గిరిజన నేత జయవర్ధన్
● 12వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు
నెల్లూరు(దర్గామిట్ట): పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని గిరిజన సంఘాల ఐక్యవేదిక నేత పొట్లూరి జయవర్ధన్ అన్నారు. కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 12వ రోజుకు చేరుకున్నాయి. దీనికి వివిధ ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. కాగా దీక్షలను ఆపేయాలంటూ పోలీసుల నుంచి సైతం బెదిరింపులు వస్తున్న సందర్భంగా జయవర్ధన్ మాట్లాడుతూ ఎన్ని అవరోధాలు ఎదురైనా న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. బలహీనవర్గాలపై నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం దారుణమన్నారు. ఎన్నికల కమిషన్‌ను కలవకూడదనే హక్కు ఎవరిచ్చారని పోలీసులను ప్రశ్నించారు. అవసరమైతే దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగుతామని తెలిపారు. మేయర్ పీఠంపై గిరిజలను కూర్చోబెట్టాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత చెంచయ్య రూ.5 వేలు విరాళాన్ని ప్రకటించారు. నగదును ఐక్యవేదిక నాయకుడు బాపట్ల వెంకటపతి యానాదికి అందజేశారు. కార్యక్రమంలో యాకశిరి మురళి సుధీర్‌బాబు చేవూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
జయవర్ధన్‌కు నోటీసులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): గిరిజనులు చేపట్టిన ఉద్యమంపై కూటమి ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. నేతలు ఇటీవల ఎన్నికల కమిషన్‌ను కలిసిన విషయాన్ని నెల్లూరు కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా ఉద్యమాన్ని కట్టడి చేయాలన్న కుట్రలు పన్నుతున్నారు. అసెంబ్లీ, ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తారని పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం జయవర్ధన్‌కు నోటీసులిచ్చారు. ఆందోళన విరమించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో గిరిజన సంఘాలు రగిలిపోతున్నాయి.
పోలీసుల బెదిరింపులకు భయపడం


