కన్నీటి సంద్రం | - | Sakshi
Sakshi News home page

కన్నీటి సంద్రం

Feb 17 2026 7:24 AM | Updated on Feb 17 2026 7:24 AM

కన్నీటి సంద్రం

కన్నీటి సంద్రం

పెళ్లికి వచ్చిన యువకుడు

స్నేహితులతో ఈతకెళ్లి మృత్యువాత

మరొకరి గల్లంతు

ఉలవపాళ్లలో విషాదం

దగదర్తి: సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఆ యువకులను విధి వంచించింది. అలల మధ్య చిక్కుకుని ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతైన విషాద ఘటన సోమవారం బోగోలు మండలం తాటిచెట్లపాళెం తీరాన చోటుచేసుకుంది. దీంతో దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికుల కథనం మేరకు.. కొంగి దీపక్‌ (18) చైన్నెలో ఉంటూ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 12న తన పెద్దమ్మ సునీత కుమారుడు ఫిలిప్‌ వివాహానికి హాజరయ్యేందుకు తల్లి, సోదరితో కలిసి ఉలవపాళ్లకు వచ్చాడు. తండ్రి గతంలోనే ప్రమాదంలో మరణించగా, తల్లి చైన్నె విమానాశ్రయంలో చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివిస్తోంది. ‘నాలుగు రోజులుండి వస్తానమ్మా’ అని దీపక్‌ అడగడంతో, కొడుకు సంతోషం కోసం సరేనని ఆమె చైన్నె వెళ్లిపోయింది. కానీ అదే తన కొడుకుతో ఆఖరి మాట అవుతుందని ఆ తల్లి కలగనలేదు.

తల్లిదండ్రుల

మృతితో..

నూనె లోకేశ్‌ జీవితం మొదటి నుంచీ కష్టాలతోనే సాగింది. హైదరాబాద్‌లో ఉండేవారు. తల్లిదండ్రులు అనారోగ్యంతో కన్నుమూయడంతో నాలుగేళ్ల క్రితం ఉలవపాళ్లలోని మేనమామ ఉసురుపాటి చినమస్తాన్‌ దగ్గరకు చేరాడు. కూలీ పనులకు వెళ్తుంటాడు.

ఏం జరిగిందంటే?

సోమవారం మధ్యాహ్నం దీపక్‌, లోకేశ్‌, కప్పల ఇమ్మానుయేలు కలిసి తాటిచెట్లపాళెం సముద్ర తీరానికి వెళ్లారు. ఇమ్మానుయేలుకు ఈత రాకపోవడంతో ఒడ్డునే ఉండిపోయాడు. దీపక్‌, లోకేశ్‌ నీటిలోకి దిగారు. ఆ సమయంలో అలల ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో మునిగిపోయారు. కళ్లముందే స్నేహితులు గల్లంతవడంతో భయంతో ఇమ్మానుయేలు బంధువులకు సమాచారం అందించాడు. తీరానికి చేరుకున్న బంధువులు, స్థానికులు వెతకగా దీపక్‌ మృతదేహం లభ్యమైంది. లోకేశ్‌ జాడ ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement