ఆడబిడ్డలకు రక్షణ కరువు
నెల్లూరురూరల్: రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కరువైందని, రోజుకో దుస్సంఘటనలు జరుగుతున్నా పాలకులు ఏమి చేస్తున్నారని, పోలీస్ వ్యవస్థ పని చేస్తోందానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఎక్కడ చూసినా దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు ఎక్కువయాయన్నారు. మొన్న నెల్లూరు, నిన్న మదనపల్లి, నేడు విజయవాడ.. ఇలా రోజుకో ఘటన వెలుగు చూస్తున్నా.. కూటమి పాలనలో రాజకీయ కక్షలు తప్ప.. బాలికలు, మహిళల మానప్రాణాలకు భద్రత లేదని విచారం వ్యక్తం చేశారు.
మద్యం, గంజాయితోనే ఈ దారుణాలు
రాష్ట్రంలో అడుగడుగునా మద్యం ఏరులై పారుతుండగా.. గంజాయి గుప్పుమంటోందని, వీటి మత్తులో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం ఉన్న సమయంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించి, కఠిన నిబంధనలను తీసుకొచ్చారన్నారు. మదనపల్లి ఘటన మద్యం మత్తులో జరిగిందని సాక్షాత్తూ హోం మంత్రి అనిత అంగీకరించారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే నెల్లోనే గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పిన చంద్రబాబు వైఫల్యం కారణంగానే మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
కీచకుల కొమ్ముకాస్తున్న ప్రభుత్వం
ఆడపిల్లల పాలిట కీచకులకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపించారు. సీఎంకు బావమరిది, లోకేశ్ మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరుడు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే పోక్సో చట్టం కింద శిక్షించకుండా, కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులు అన్యాయం చేసిన వారిని విడిచి పెట్టి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి, భయపెట్టేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడ వారిపై చేయివేస్తే అదే ఆఖరి రోజవుతుందని చంద్రబాబు సినిమా డైలాగ్‌లు చెప్పారని, రోజుకో అఘాయిత్యం జరుగుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.
జగనన్న పాలనలోనే మహిళలకు రక్షణ
జగనన్న సీఎంగా ఉన్నప్పుడు బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలంటే వణికిపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. దిశ యాప్ తెచ్చి, మహిళలకు పూర్తి రక్షణ కల్పించారని, తప్పు చేస్తే తప్పించుకోలేమనే భావనను ప్రతి ఒక్కరికీ కలిగించారన్నారు. తన తండ్రిని అక్రమ కేసులో పోలీస్‌లు విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తున్నారని, సిద్ధంగా ఉన్నా.. వాయిదాలేస్తున్నారన్నారు. గుమ్మళ్లదిబ్బలో బాలిక విషయంలో తప్పు చేసిన వారిని శిక్షించడాన్ని మాని, అండగా నిలిచి పరామర్శిస్తే తమపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యేతో పాటు మైనార్టీ నేతలు పరామర్శించారని, అయితే వారికెందుకు నోటీసులివ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. పార్టీ జోనల్ మహిళాధ్యక్షురాలు గౌరి, అంగన్‌వాడీ వింగ్ జిల్లా అధ్యక్షురాలు లావణ్య, నెల్లూరు రూరల్ మహిళాధ్యక్షురాలు రమాదేవి, జెడ్పీటీసీ శేషమ్మ, నిర్మలమ్మ, ఎంపీటీసీ లక్ష్మీ కల్యాణి, సర్వేపల్లి మహిళాధ్యక్షురాలు సంధ్యారాణి పాల్గొన్నారు.
రాష్ట్రంలో రోజుకో దుస్సంఘటనలు
ప్రభుత్వం ఉందా..?
పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందా..?
వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత


