రాబడి కోసం ప్రభుత్వం ఒత్తిడి ..మా ప్రయత్నం మేం చేస్తున్నాం సార్..
నెలాఖరులోగా నూరుశాతం వసూలు చేయాలి
లేకపోతే సస్పెండ్ చేస్తామని అధికారుల బెదిరింపులు
ఆందోళనలో ఉద్యోగులు
జిల్లాలో వసూళ్ల లక్ష్యం రూ.50.08 కోట్లు
ఉదయగిరి: సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం కూటమి నేతలు అనేక అడ్డదారులు తొక్కారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత హామీలను మరిచిపోయారు. సంపద సృష్టికి బదులు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారు. ఇప్పటికే మద్యం, విద్యుత్ సర్‌చార్జీలు పెంచడం ద్వారా కోట్ల ఆదాయం గడించిన ప్రభుత్వం ప్రస్తుతం గ్రామీణ ప్రజలపై పన్నుపోటు మోపుతోంది. ముక్కుపిండి పన్నులు వసూలు చేయాలంటూ పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి వేలాడదీసింది. ఈ నెలాఖరులోగా లక్ష్యాలు సాధించకపోతే సస్పెండ్ చేస్తామంటూ వారిని బెదిరింపులకు గురిచేస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుగుతున్నా పన్నులు వసూళ్లు కాకపోతుండడంతో ఏం చేయాలో తెలియక పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లావ్యాప్తంగా 4.08 లక్షల పన్ను అసెస్మెంట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50.02 కోట్ల పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈనెలాఖరులోగా వంద శాతం పూర్తిచేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీచేసింది. లక్ష్యాలు అధిగమించకపోతే మండలానికి ఒకరిద్దరు కార్యదర్శుల చొప్పున సస్పెండ్ చేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో రూ.20.66 కోట్లకు పైగా పన్నులు వసూలు చేశారు. గతంలో ఇంటి పన్నులకు సంబంధించి మార్చిలో నోటీసులు జారీచేసి ఆ మరుసటి నెలలో వసూలు చేసేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పాత ప్రక్రియకు స్వస్తిచెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి నెలాఖరులోగా వంద శాతం వసూలు చేయాలని ఒత్తిడి తేవడం, మార్చి వరకు సమయం ఉందంటూ ప్రజలు పన్నులు చెల్లించకపోవడంతో కార్యదర్శులు నలిగిపోతున్నారు. కొందరు తీవ్ర మానసిక వేదనకు గురవుతూ సెలవులపై వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఫ్యాక్టరీలు, పెద్ద గోదాముల యజమానులు నెలాఖరులో పన్నులు చెల్లిస్తామని చెబుతుండటంతో అనుకున్న లక్ష్యాలకు ఆటంకంగా మారుతోందని కొందరు వాపోతున్నారు.
ఆన్‌లైన్ విధానంతో సమస్యలు
ప్రభుత్వం పన్నుల వసూళ్లకు కొత్తగా తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఎవరైతే ఇంటి, కుళాయి పన్నులు చెల్లించాలనుకుంటున్నారో వారు తమ సెల్‌ఫోన్ నుంచే నగదు కట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారు తక్కువగా ఉండటం, వారికి స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం చెల్లింపులకు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. అలాంటి వారినుంచి పన్నులు వసూలు చేయడం సవాలుగా మారుతోందని కార్యదర్శులు చెబుతున్న మాట. ఒకే ఇంటి నంబర్‌లో పన్ను చెల్లింపు ప్రారంభిస్తే అందులో ఏమైనా చిన్న సమస్య ఎదురైతే మరో 24 గంటల వరకు సర్వర్ స్తంభిస్తోంది. దీంతో ఆ ఇంటి పన్ను తిరిగి చెల్లించాలంటే ఒకరోజు ఆగాలి. ఇలాంటి సాంకేతికపరమైన సమస్యలు ఉన్నందున అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రాణాలతో చెలగాటం
కార్యదర్శులు గ్రామాల్లో చెత్త సేకరణ ప్రక్రియ పర్యవేక్షించాల్సి ఉంది. అందులో ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే ఐఆర్‌వీఎస్ కాల్స్‌లో పనితీరు 50 శాతం తగ్గితే కార్యదర్శులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా వివిధ సర్వేల నిమిత్తం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పన్నుల వసూళ్లకు సంబంధించి లక్ష్యాలను నిర్ణయించడంతో పనిఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ అధికారులు పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతుండటంతో వయస్సు పైబడిన వారు బీపీ, షుగర్ తదితర వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగులకు మంచి చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు పనిఒత్తిడి పెంచి తమ ప్రాణాలతో చెలగాటమాడున్నారని పలువురు వాపోతున్నారు.


