గంజాయికి అడ్డాగా ఏపీ
● ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ప్రసన్నకుమార్‌రెడ్డి
● గుమ్మళ్లదిబ్బలో
బాలిక కుటుంబానికి పరామర్శ
కోవూరు: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, గంజాయికి అడ్డాగా మారిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని గుమ్మళ్లదిబ్బ కొత్త కాలనీలో గంజాయి ముఠా చేతుల్లో అఘాయిత్యానికి గురై, చైన్నెలో చికిత్స పొందుతూ బాలిక మరణించడంతో వారి కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఓదార్చి, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో గంజాయి ముఠాల ఆగడాలు మితిమీరిపోయాయని ఆరోపించారు. బాలికపై ఇంతటి అఘాయిత్యం జరిగినా, ప్రభుత్వ స్పందన దారుణమని, మెరుగైన వైద్యాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. సరైన వైద్యం అందకపోవడంతోనే బాలిక మృతి చెందిందంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
విచారణను పక్కదారి పట్టించొద్దు
పోలీస్ యంత్రాంగం తీరుపై ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణను నీరుగార్చేందుకు యత్నించొద్దని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తే తమ పార్టీ ఊరుకోబోదని స్పష్టం చేశారు. సీబీఐ విచారణను నిర్వహించాలని, లేని పక్షంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తాము జరిపిస్తామని వెల్లడించారు. ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కర్నీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహులురెడ్డి, జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, కన్వీనర్ అత్తిపల్లి అనూప్‌రెడ్డి, దినేష్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, గొల్లపల్లి విజయకుమార్, గంగవరం సర్పంచ్ లక్ష్మీకుమారి, మందా రవి, చిరంజీవి, జనార్దన్, కోవూరు మాజీ సర్పంచ్ కూట్ల ఉమా, కిశోర్, గయాజ్, ప్రసాద్, అనీష్ తదితరులు పాల్గొన్నారు.


