శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమ యం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,632 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,435 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.28కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
జొన్నవాడ ఆలయ అతిథి గృహంలో టీడీపీ సమావేశం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయానికి చెందిన అతిథి గృహంలో టీడీపీ నాయకులు రాజకీయ సమావేశం నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. గత ఆదివారం జొన్నవాడ గ్రామ సర్పంచ్ పెంచలయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆలయ అతిథిగృహంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ఆలయ ఆవరణలో, ఆలయ భవనాల్లో రాజకీయ సమావేశాలు నిర్వహించకూడదు. రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఇవన్నీ పక్కనపెట్టి అధికార టీడీపీ నాయకులు ఏకంగా అమ్మవారి ఆలయానికి చెందిన అతిథిగృహంలో పార్టీ సమావేశం నిర్వహించడం అధికార అహంకారానికి అద్దం పడుతోందని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన భవనంలో రాజకీయ సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ సమావేశానికి ఎలా అనుమతి ఇచ్చారని ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. ఈ విషయమై ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా అక్కడ జరిగింది రాజకీయ సమావేశం కాదని, గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సమావేశమని తెలిపారు. శివరాత్రి ఏర్పాట్ల గురించి చర్చించారని పేర్కొన్నారు. అయితే ఆలయ అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు లేరు కదా అని ప్రశ్నించగా సమాధానం దాట వేశారు.


