వినాయక చతుర్థి
గణేశ నిమజ్జనం
గణపతిని ఇంటికి తీసుకొస్తాం.. భక్తిశ్రద్ధలతో పూజిస్తాం.. కోరిన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తాం. మరి పూజలు పూర్తయ్యాక అదే గణపతిని నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తాం? ఎంతో భక్తితో ఇంటికి తీసుకొచ్చిన దేవుడిని చివరికి నీటిలో ఎందుకు కలిపేస్తారు? దీని వెనుక కేవలం ఆచారం మాత్రమే ఉందా? లేక మనకు అర్థం కాని ఆధ్యాత్మిక సందేశం ఏదైనా ఉందా? శాస్త్రోక్త సంప్రదాయాలను పరిశీలిస్తే.. గణేశ నిమజ్జనం వెనుక ప్రకృతి, జీవితం గురించి చెప్పే ఓ గొప్ప భావన కనిపిస్తుంది.
శాస్త్రోక్త సంప్రదాయాల ప్రకారం.. గణపతి విగ్రహాన్ని మట్టి వంటి సహజ పదార్థాలతో తయారు చేయడం వెనుక ప్రత్యేకమైన అర్థం ఉంది. ప్రకృతి నుంచి తీసుకున్న మట్టితో గణపతి రూపాన్ని తయారు చేసి, కొంతకాలం భక్తితో పూజించిన తర్వాత తిరిగి అదే ప్రకృతిలో కలిపేస్తారు. పండితుల వివరణ ప్రకారం.. ఇది ప్రకృతిలో జరిగే సహజ మార్పును గుర్తుచేస్తుంది. పుట్టుక, జీవితం, చివరికి ప్రకృతిలో కలిసిపోవడం.. ప్రతి జీవికి, ప్రతి రూపానికి సహజమైన పరిణామమే అనే విషయాన్ని గణపతి నిమజ్జనం గుర్తుచేస్తుంది.
నీటిలోనే నిమజ్జనం ఎందుకు చేస్తారు?
భారతీయ సంప్రదాయాల్లో నీటికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. నీటిని జీవానికి ఆధారంగా, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. నీరు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది. ఎండిపోయిన నేలకు వర్షం పడితే మళ్లీ పచ్చదనం చిగురించినట్లే.. నీరు కొత్త జీవానికి నాంది పలుకుతుంది. అలా గణపతి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడంతో.. ప్రకృతి నుంచి తీసుకున్నది తిరిగి ప్రకృతికే చేరుతుందనే భావనను సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. మట్టి విగ్రహం నీటిలో క్రమంగా కరిగి సహజ పదార్థాల్లో కలిసిపోవడం కూడా ప్రకృతిలో ప్రతీది లీనం అనే భావనకు ప్రతీకగా చూడవచ్చు.
ఎన్నవరోజు నిమజ్జనం చేయాలి?
గణపతిని ఎన్ని రోజులకు నిమజ్జనం చేయాలనే విషయంలో కూడా ఒకే విధానం లేదు. అయితే, కుటుంబ సంప్రదాయాలు, ప్రాంతీయ ఆచారాలను బట్టి నిమజ్జనం చేసే రోజు మారుతూ ఉంటుంది. కొందరు ఒకటిన్నర రోజునే నిమజ్జనం చేస్తే.. మరికొందరు 3, 5, 7, 9 లేదా 10వ రోజున నిమజ్జనం చేస్తారు. అంటే పదో రోజునే తప్పనిసరిగా నిమజ్జనం చేయాలనే నియమం అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. ఆయా ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలకు అనుగుణంగా గణపతి నిమజ్జనం జరుగుతుంది.
ఇక గణేశ నిమజ్జనం మనకు చెప్పే అసలు సందేశం మన జీవితంతో ముడిపడి ఉందన్న విషయం వేద పండితులు ఈ పండుగతో మనకు పదే పదే గుర్తుచేస్తున్నారు. ఎంత అందమైన రూపమైనా శాశ్వతం కాదు. అలాగే మనం సంపాదించే సంపద, హోదా, పేరు కూడా శాశ్వతంగా మనతో ఉండవు. ప్రకృతి నుంచి తీసుకున్నదాన్ని తిరిగి ప్రకృతికే అందించడంతో.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే విషయాన్ని ఈ ఆచారం గుర్తుచేస్తుంది.
గణపతిని భక్తితో ఆహ్వానించినట్టే.. సమయం వచ్చినప్పుడు అదే భక్తితో సాగనంపడం కూడా జీవితంలో ఒక భాగమేనని చెబుతున్నారు. వచ్చినదాన్ని కృతజ్ఞతతో స్వీకరించడం.. సమయం వచ్చినప్పుడు వదిలేయడం.. మనం నేర్చుకున్న మంచి విషయాలను మాత్రం జీవితాంతం మనతో తీసుకెళ్లడం.. ఇదే గణేశ నిమజ్జనం మనకు అందించే అందమైన జీవిత సందేశం.
ఇదీ చదవండి: మహాలయ పక్షం వచ్చేసింది.. ఈ 15 రోజులు ఏం చేయాలో తెలుసా?


