ఫుడ్‌ కాదు.. ఆర్డర్‌ చేశామనే కిక్‌ చాలు! కొత్త ట్రెండ్‌ ఏం చెబుతుందంటే? | Food Never Comes, The Viral Website That Lets You Order Food Online Without Ever Getting It, Check Details | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ కాదు.. ఆర్డర్‌ చేశామనే కిక్‌ చాలు! కొత్త ట్రెండ్‌ ఏం చెబుతుందంటే?

Sep 24 2026 9:42 AM | Updated on Sep 24 2026 10:20 AM

Food Ordering Dopamine Trend

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశారు.. డబ్బులు మాత్రం కట్టలేదు! అయినా ఆర్డర్‌ చేసినంత సంతృప్తి కలిగితే ఎలా ఉంటుంది? ఆకలిగా ఉన్నా లేకపోయినా.. నచ్చిన వంటకాలను ఎంచుకుని కార్ట్‌లో వేసుకుని, చెక్‌అవుట్‌ చేసి డెలివరీ కోసం ఎదురుచూస్తున్న అనుభూతిని పొందొచ్చు. కానీ చివరికి ఇంటికి మాత్రం ఆహారం రాదు. ఇదే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఆసక్తికరంగా మారిన ఓ కొత్త ప్రయోగం.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు పుర్వాన్ష్‌ పర్మార్‌, అన్షుల్‌ శర్మ కలిసి ‘Food Never Comes’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇందులో 22 రకాల వంటకాలు, 327 డిష్‌లు ఉన్నాయి. నిజమైన వంటకాల ఆధారంగా ధరలతో సహా రూపొందించిన ఈ సైట్‌లో వినియోగదారులు కార్ట్‌లో ఆహారాన్ని వేసుకుని నకిలీ చెక్‌అవుట్‌ చేయొచ్చు. ఆ తర్వాత ఏఐ రూపొందించిన ఫోన్‌కాల్‌లో డెలివరీ బాయ్‌ అడ్రస్‌ దొరకడం లేదని చెబుతాడు. జూన్‌లో ప్రారంభమైన ఈ సైట్‌ను ఇప్పటివరకు 27 లక్షల మందికి పైగా సందర్శించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

‘ఆహారం రాదు.. కానీ ఆర్డర్‌ చేసిన ఆనందం వస్తుంది’ అనేది ఈ సైట్‌ ఉద్దేశం. ఇలాంటి వాటిని ‘డోపమైన్‌ సైట్స్‌’గా పిలుస్తున్నారు. దక్షిణ కొరియాలో మొదలైన ఈ తరహా ప్రయోగాలు ఇప్పుడు ఇతర దేశాలకూ విస్తరిస్తున్నాయి. పర్మార్‌, శర్మలు తమ ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఫుడ్‌ ఆర్డరింగ్‌ అలవాట్లను గమనించిన తర్వాత ఈ ఆలోచనకు వచ్చారు. ఆకలి లేకపోయినా బోర్‌గా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదైనా ఆర్డర్‌ చేయాలనిపించడం అలవాటుగా మారొచ్చని వారు చెబుతున్నారు.

ఈ విధంగా ఊహాత్మకంగా ఆర్డర్‌ చేయడం నిజమైన కోరికను తగ్గిస్తుందా అన్న దానిపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. యేల్‌ యూనివర్సిటీకి చెందిన రవి ధర్‌.. ఏదైనా వస్తువు దొరుకుతుందన్న ఎదురుచూపులోనే ఆనందం ఉండొచ్చని చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ న్యూరోసైంటిస్ట్‌ కెంట్‌ బెరిడ్జ్‌ మాత్రం ‘కావాలనిపించడం’, ‘ఆనందించడం’ వేర్వేరు ప్రక్రియలని వివరిస్తున్నారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ అన్నా లెంబ్కే కూడా డోపమైన్‌ను కేవలం ఆనందాన్ని ఇచ్చే రసాయనంగా చూడటం సరైంది కాదని పేర్కొన్నారు.

Food Never Comes సృష్టికర్తలు ఇప్పుడు ‘Trip Never Leaves’ పేరుతో ప్రయాణ అనుభూతిని ఇచ్చే మరో సైట్‌ను కూడా రూపొందించారు. అయితే ఇలాంటి సైట్లు కొందరిలో కొనుగోలు కోరికను తగ్గించవచ్చని, మరికొందరిలో అదే అలవాటును మరింత బలపరిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై మరింత పరిశోధన అవసరమని పేర్కొంటున్నారు. భవిష్యత్తులో తమ సైట్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని న్యూరోసైంటిస్టులు, సైకాలజిస్టులతో పంచుకోవాలని డెవలపర్లు భావిస్తున్నారు. అయితే, 'మనకు నిజంగా కావాల్సింది వస్తువా.. లేక దాన్ని కొనాలనే క్షణిక ఉత్సాహమా?' అన్నదే ఇప్పుడు వెంటాడుతున్న అసలు ప్రశ్న.

ఇదీ చదవండి: ఆటోవాలా లైఫ్‌లో.. సంపాదన మూరెడు.. చదువు ఖర్చు బారెడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement