ముంబై: యూపీఐ చెల్లింపు లావాదేవీలు సెప్టెంబర్‌లో 2,407 కోట్లుగా నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో జరిగిన 2,450 కోట్ల లావాదేవీలతో పోలిస్తే 1.8 శాతం క్షీణించాయి. విలువపరంగా కూడా 28.82 లక్షల కోట్ల నుంచి 1.50 శాతం తగ్గి రూ. 29.37 కోట్లకు పరిమితమయ్యాయి. త్వరలో అధిక విలువ చేసే యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు, ఐఎంపీఎస్ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 7.05 లక్షల కోట్ల విలువ చేసే 35.40 కోట్ల లావాదేవీలు జరిగాయి. యూపీఐ, ఐఎంపీఎస్‌లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తోంది. ఆర్‌బీఐ నిర్వహించే ఆర్‌టీజీఎస్ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 235.71 లక్షల కోట్ల విలువ చేసే 3.25 కోట్ల లావాదేవీలు, నెఫ్ట్ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 46.75 కోట్ల విలువ చేసే 86.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.


