ఆర్‌అండ్‌డీపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలి
టెక్నాలజీలను ఇక్కడే ఆవిష్కరించుకోవాలి
నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గుబ
న్యూఢిల్లీ: భారత్ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా, ఆవిష్కరణలకు చిరునామాగా మారేందుకు పరిశ్రమ రక్షణాత్మక ధోరణి వీడి.. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)పై మరిన్ని నిధులను వెచ్చించాలని నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గుబ సూచించారు. ప్రభుత్వం తన వంతుగా సంస్కరణల అజెండాను కొనసాగిస్తూ, విశ్వసనీయమైన పాలనను అందిస్తుందన్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధాల వంటి పరిస్థితుల నేపథ్యంలో బలమైన సరఫరా వ్యవస్థలు చర్చనీయాంశంగా మారినట్టు చెప్పారు. భారత్ యాపిల్ మాదిరి విజయగాధను ఎన్నో రెట్లు పునరావృతం చేయగలదంటూ.. వియత్నాం, ఇండోనేషియా, మెక్సికోతో పోటీపడుతూ ప్రపంచానికి తయారీ కేంద్రంగా అవతరించగలదని చెప్పారు. సీఐఐ నిర్వహించిన వార్షిక సదస్సులో పాల్గొన సందర్భంగా రాజీవ్‌గుబ ఈ అంశాలను ప్రస్తావించారు.
మన దగ్గరే ఎంతో తక్కువ..
‘‘ఆర్‌అండ్‌డీపై మన దేశంలో స్థూల వ్యయాలు చాలా తక్కువగా ఉన్న విషయం తెలుసు. చాలా కాలంగా జీడీపీలో 0.7 శాతం వద్దే ఉండిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్‌అండ్‌డీపై వెచ్చిస్తున్న సగటు 2.3 శాతంతో పోల్చితే ఎంతో తక్కువ. దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ కంటే కూడా చాలా తక్కువ. మన దేశంలో చేస్తున్న 0.7 శాతం వ్యయాల్లోనూ సగం ప్రభుత్వం భరిస్తున్నదే. కనుక భారత పరిశ్రమలు ఆర్‌అండ్‌డీపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. దీన్ని వ్యయాలుగా చూడొద్దు. టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికి బదులు దాన్ని ఇక్కడే ఆవిష్కరించుకోవాలి. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) చేసుకుంటున్నందున భారత కంపెనీలు అంతర్జాతీయ పోటీని సవాలుగా తీసుకోవాలి’’అని రాజీవ్ సూచించారు.


