‘మైలేజీ తగ్గుతుంది.. కానీ..’ | mileage-drops-but-engines-safe-e20-gadkari | Sakshi
Sakshi News home page

‘మైలేజీ తగ్గుతుంది.. కానీ..’

Jul 10 2026 4:45 PM | Updated on Jul 10 2026 4:48 PM

mileage-drops-but-engines-safe-e20-gadkari

దేశంలో పెరుగుతున్న కాలుష్యం, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ20 (20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్) ఇంధనంపై వాహనదారుల్లో ఉన్న పలు అనుమానాలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెరదించారు. ఈ20 ఇంధనం వల్ల కారు మైలేజీ కొంతవరకు తగ్గుతుందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే, దీనివల్ల ఇంజిన్లు దెబ్బతింటాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

మైలేజీ తగ్గడానికి కారణం ఇదే..!

సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కేలరీల విలువ తక్కువగా ఉండటం వల్లే మైలేజీలో స్వల్ప వ్యత్యాసం ఉంటుందని గడ్కరీ వివరించారు. ‘ఇథనాల్, పెట్రోల్ మధ్య కేలరీల విలువలో వ్యత్యాసం ఉండటం వాస్తవం. అయితే మైలేజ్ అనేది కేవలం ఇంధనం పైనే కాకుండా డ్రైవింగ్ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ట్రాఫిక్ కారణంగా వాహనాలు తక్కువ గేర్లలో నడుస్తాయి. స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో నిరంతరం బ్రేకులు వేయడం వల్ల మైలేజ్ తగ్గుతుంది. అదే హైవేలపై గంటకు 100 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో వెళ్తే మైలేజీలో కొంత వ్యత్యాసాన్ని మాత్రమే గమనించవచ్చు’ అని నితిన్ గడ్కరీ అన్నారు.

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) నివేదిక ప్రకారం.. ప్రత్యేకంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లతో రూపొందించిన వాహనాలకు మైలేజ్ సామర్థ్యంతో ఎటువంటి సమస్య ఉండదని, అందుకే భవిష్యత్తులో ఫ్లెక్స్ ఇంజిన్ టెక్నాలజీని మరింత విస్తరించడంపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు.

ఇంజిన్ దెబ్బతింటుందనేది తప్పుడు ప్రచారం

ఈ20 ఇంధనం వల్ల వాహన భాగాలు పాడవుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి ఖండించారు. ఇదంతా ఒక తప్పుడు కథనం సృష్టించే ప్రయత్నంలో భాగమేనన్నారు. ‘ఏఆర్‌ఏఐ, వాహన తయారీదారులు ఎన్నో క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ20 ఇంధనాన్ని మార్కెట్లోకి తెచ్చారు. కొన్ని పాత మోడల్ వాహనాల్లో కొన్ని భాగాలపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే, సర్వీసింగ్ సమయంలో ఆయా భాగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే వాహన తయారీ సంస్థలను కోరింది. ఈ20 ఇంధనం కారణంగా దెబ్బతిన్న ఒక్క కారునైనా నాకు చూపించండి’ అని గడ్కరీ సవాల్ విసిరారు.

ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement