కాయగూరలు, పాలు, పెరుగు, చికెన్, మటన్.. ఏ ఆహార పదార్థమైనా కానివ్వండి. కొనేవి తాజాగా ఉండాలని కోరుకుంటాం!. కానీ ఏది తాజాది? ఏది పాతదని తెలిసేదెలా? ప్యాకేజీపై మా స్టిక్కర్లు ఉంటే చాలు అంటోంది బయోసౌక్!
బెంగళూరులోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో మొదలైన స్టార్టప్ కంపెనీ (బయోసౌక్) ఇది. స్మార్ట్‌సెన్స్ పేరుతో వీరు ఆహార పదార్థాల తాజాదనాన్ని గుర్తించేందుకు ఒక ప్యాకేజింగ్ మెటీరిల్‌ను అభివృద్ధి చేశారు. ఇది కాగితం ఆధారంగానే తయారవుతుంది కానీ.. అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులను గుర్తించేందుకు ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆహార పదార్థాలు పాడయ్యే క్రమంలో ఈ వాయువులనే వదులుతాయి. వాటిని గుర్తిస్తే ఆహారం ఎంత పాతదో ఇట్టే తెలిసిపోతుందన్నమాట. వాయువుల మోతాదుకు తగ్గట్టుగా ఈ ప్యాకేజింగ్ మెటీరియల్‌పై ఉన్న స్టిక్కర్‌పై రంగులు మారిపోతుంటాయి. ఏ రంగు ఎంత పాతదన్న విషయాన్ని సూచిస్తుంది. కోడిగుడ్లు మొదలుకొని మాంసం, సముద్ర ఉత్పత్తులు, పాలు, పెరుగు, కాయగూరల్లాంటి ఆహార పదార్థాల వరకు అన్నింటి తాజాదనాన్ని గుర్తించవచ్చు.
ఎక్స్‌పైరీ డేట్‌తో పనిలేదు
ఇప్పటివరకూ ఆహార పదార్థాల తాజాదనాన్ని గుర్తించేందుకు నిర్దిష్ట పద్దతి అంటూ ఏదీ లేదు. ఫలానా టైమ్‌లోపు వాడండి అన్న ఎక్స్‌పైరీ డేట్ మాత్రమే అందుబాటులో ఉంది. లేదంటే ల్యాబ్‌లో పరీక్షించి నిర్ధారించుకోవాలి. ఫలితంగా చాలాచోట్ల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. పోస్ట్ హార్వెస్టింగ్ నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. తినే ఆహారం సురక్షితమా? కాదా? అన్న అనుమానాలూ వస్తూంటాయి.
ఈ సమస్యలన్నింటినీ స్మార్ట్‌సెన్స్ ప్యాకేజింగ్ ద్వారా అధిగమించవచ్చునని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ తెలిపారు. రైతులు, ఉత్పత్తిదారులకు నష్టాలు తగ్గడమే కాకుండా.. వినియోగదారులు తగిన నిర్ణయం తీసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.


