ఆహా ఏమి రుచి! వంటకాల్లో ఇవి చాలా స్పెషల్‌!! | Unique Dishes And Making Methods | Sakshi
Sakshi News home page

ఆహా ఏమి రుచి! వంటకాల్లో ఇవి చాలా స్పెషల్‌!!

Jul 5 2026 12:15 PM | Updated on Jul 5 2026 12:15 PM

Unique Dishes And Making Methods

ప్రతిరోజూ వంటకాల్లో ఎన్నోరుచులను ఆస్వాదిస్తుంటాం. సమయానికి ఆ రుచైన వంటకం అందుబాటులో లేకపోతే ఇబ్బంది పడుతుంటాం. అందులో లడ్డూ, మిఠాయిలు, రకరకాల కర్రీస్‌, సూప్‌లు ఇలా ఎన్నో ఉంటాయి. అయితే వాటిని కొన్నిక్షణాల్లోనే ఎలా తయారుచేయాలో? మరి అవేంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

మునక్కాయ సూప్‌..  

కావలసినవి:
మునక్కాయలు: 3 (ముక్కలుగా కట్‌ చేసినవి),
మసూర్‌ దాల్‌: 3 టేబుల్‌ స్పూన్లు,
టొమాటో: ఒకటి (ముక్కలుగా కట్‌ చేసినది),
ఉల్లిపాయ: 1/2 (ముక్కలుగా కట్‌ చేసినది),
వెల్లుల్లి రెబ్బలు: 2,
పచ్చిమిర్చి: 2,
దాల్చిన చెక్క: ఒక అంగుళం,
లవంగాలు: 1/2 టీస్పూన్,
మిరియాలు: టీస్పూన్,
ధనియాలు: టీస్పూన్,
జీలకర్ర: టీస్పూన్,
ఉప్పు: రుచికి సరిపడా,
నీళ్లు: అవసరమైనన్ని,
నల్ల ఉప్పు: 1/2 టీస్పూన్,
కొత్తిమీర: 2 టేబుల్‌ స్పూన్లు,
పుదీనా: 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ:

  • ముందుగా ఒక ప్రెజర్‌ కుక్కర్‌ తీసుకొని, అందులో కట్‌ చేసిన మునక్కాయ ముక్కలు, మసూర్‌ దాల్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేయండి.

  • అందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సాధారణ ఉప్పు కూడా కుక్కర్‌లోనే వేసేయండి.

  • చివరగా 3 కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి ఐదు విజిల్స్‌ వచ్చే వరకు సిమ్‌లో ఉడికించండి.

  • తరువాత ఉడికిన మిశ్రమం నుంచి వడకట్టి నీటిని వేరు చేసి పక్కన పెట్టుకోండి.

  • ఉడికిన మునక్కాయ ముక్కలను, మిగిలిన పదార్థాలను ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు జోడించి, మెత్తగా గ్రైండ్‌ చేయండి.

  • ఇప్పుడు ఈ గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని ఒక జల్లెడ సహాయంతో బాగా వడకట్టి, మునక్కాయ తొక్కలు రాకుండా కేవలం చిక్కటి గుజ్జును మాత్రమే వేరు చేసుకోండి.

  • ఇప్పుడు ఒక కడాయి స్టవ్‌ పై పెట్టి, అందులో మనం వడకట్టుకున్న మునక్కాయ గుజ్జు, మొదట పక్కన పెట్టుకున్న ఉడికించిన నీళ్లను పోయండి.

  • ఇందులో నల్ల ఉప్పు వేసి బాగా కలిపి, సూప్‌ను మరిగించండి.

  • సూప్‌ మరుగుతున్న సమయంలో, ఒక చిన్న మిక్సీ జార్‌లో 2 టేబుల్‌ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్‌ స్పూన్ల పుదీనా వేసి కొద్దిగా నీటితో మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్‌ చేయండి.

  • ఈ కొత్తిమీర–పుదీనా పేస్ట్‌ను మరుగుతున్న సూప్‌లో వేసి బాగా కలపండి. అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి మునక్కాయ సూప్‌ సిద్ధం!

బటర్‌ చిక్‌పీస్‌..
కావలసినవి:
కాబూలీ చనా: కప్పు (ఉడికించినవి),
బటర్‌: 2 పెద్ద చెంచాలు, 
నూనె: టీస్పూన్,
గ్రేవీ కోసం– ఉల్లిపాయలు: 2 (ముక్కలుగా కోసినవి),
టొమాటోలు: 3 (ముక్కలుగా కోసినవి),
అల్లం వెల్లుల్లి పేస్ట్‌: టీస్పూన్,
జీడిపప్పులు: 10,
మసాలాలు– బిర్యానీ ఆకు: 1,
కారం: రుచికి సరిపడా,
గరం మసాలా: 1/2 స్పూన్,
ధనియాల పొడి: టీస్పూన్,
కసూరీ మేథీ: టీస్పూన్,
ఫ్రెష్‌ క్రీమ్‌: 2 పెద్ద చెంచాలు,
ఉప్పు: రుచికి సరిపడా, 
కొత్తిమీర: కొద్దిగా.

తయారీ:

  • ముందుగా స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి, అందులో ఒక చెంచా నూనె, ఒక చెంచా వెన్న వేసి అందులో కట్‌ చేసిన ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి 2–3 నిమిషాలు వేయించండి.

  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి, టొమాటోలు మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గనివ్వండి.

  • ఈ మిశ్రమం చల్లారిన తర్వాత, మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్‌ చేసుకోండి.

  • ఇప్పుడు అదే పా¯Œ లో మిగిలిన ఒక చెంచా వెన్న వేసి కరిగించి.. ఇందులో బిర్యానీ ఆకు వేసి, ఆ వెంటనే మనం మిక్సీ పట్టుకున్న టొమాటో–ఉల్లిపాయ పేస్ట్‌ను వేసి బాగా కలపండి.

  • ఈ గ్రేవీని నూనె/వెన్న పైకి తేలే వరకు మీడియం మంటపై ఉడికించండి. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి.

  • మసాలాలు వేగిన తర్వాత, ముందుగా ఉడికించి పెట్టుకున్న తెల్ల శనగలను నీటితో సహా వేసి, సిమ్‌లో 5 నుంచి 7 నిమిషాలు ఉడికించండి.

  • కర్రీ చిక్కబడిన తర్వాత, ఇందులో ఫ్రెష్‌ క్రీమ్‌ వేయండి. చివరగా కసూరీ మేథీని చేతులతో నలిపి చల్లి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒక్క నిమిషం పాటు ఉంచి స్టవ్‌ ఆఫ్‌ చేయండి.

  • అంతే ఎంతో క్రీమీగా, నోరూరించే ఇండియన్‌ బటర్‌ చిక్‌పీస్‌ రెడీ!

బాదం లడ్డూ..
కావలసినవి:
బాదం పప్పు: కప్పు,
ఎండు కొబ్బరి తురుము: కప్పు,
బెల్లం తురుము: 3/4 కప్పు,
ఏలకుల పొడి: 1/4 టీస్పూన్,
నెయ్యి: 2 టేబుల్‌ స్పూన్లు,
జీడిపప్పు: 10 (చిన్న ముక్కలుగా కట్‌ చేసినవి),
కిస్మిస్‌: 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ:

  • ముందుగా స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి, అందులో బాదం పప్పు వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి వచ్చే వరకు వేయించండి.

  • వేగిన పప్పులను పూర్తిగా చల్లారనిచ్చి, ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేసుకుని పక్కన పెట్టుకోండి.

  • ఇప్పుడు అదే పా¯Œ లో కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి, అది కూడా గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకు దోరగా వేయించండి.

  • వేయించిన కొబ్బరి తురుమును మిక్సీ జార్‌లోకి తీసుకుని, దాంతో పాటు బెల్లం తురుము కూడా వేయండి.

  • దీనిని కూడా పల్స్‌ మోడ్‌లో కొద్దిగా బరకగా గ్రైండ్‌ చేసుకోండి.

  • ఈ కొబ్బరి–బెల్లం మిశ్రమాన్ని కూడా ముందే సిద్ధం చేసి పెట్టుకున్న బాదం పొడి ఉన్న గిన్నెలోనే వేసేయండి.

  • ఇందులోనే ఏలకుల పొడి వేసి, అన్ని పదార్థాలు బాగా కలిసేలా చేత్తో ఒకసారి కలుపుకోండి.

  • ఇప్పుడు పా¯Œ లో 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి 10 జీడిపప్పు ముక్కలు, కిస్మిస్‌ వేసి వేయించుకుని ముందుగా మనం సిద్ధం చేసుకున్న లడ్డూ మిశ్రమంలో కలపాలి.

  • ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోండి.

  • ఎంతో టేస్టీ బాదం లడ్డూలు రెడీ! వీటిని ఒక ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లో భద్రపరచుకుంటే 2 వారాల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. రోజూ ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement