ఓ సముద్రజీవి.. ఐదేళ్ల ఉపవాసం! | Chinese Scientists Discover Sea Creature That Can Survive Without Food For Five Years, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ఓ సముద్రజీవి.. ఐదేళ్ల ఉపవాసం!

Jul 7 2026 8:32 AM | Updated on Jul 7 2026 10:08 AM

super giant isopod can survive without food for five years

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: ఒక్క రోజు ఉపవాసం ఉండటమే మనకు కష్టమనిపిస్తుంది. కానీ ఆహారం తినకుండా ఐదేళ్లపాటు జీవించగల ఒక వింత జీవి ఉన్నట్లు చైనా పరిశోధకులు గుర్తించారు. ఆ జీవి పేరు సూపర్‌జైంట్‌ ఐసోపాడ్‌. సముద్రగర్భంలో నివసించే ఈ జీవి మనుగడ రహస్యాన్ని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకులు ఛేదించారు. 

ఈ పరిశోధన వివరాలు సెల్‌ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. సముద్ర గర్భంలో చీకటి, తీవ్రమైన ఆహార కొరత, అతిశీతల పరిస్థితుల మధ్య ఈ భారీ ఐసోపాడ్‌లు నివసిస్తాయి. చనిపోయిన తిమింగలాలు, చేపల కళేబరాలను తిని బతుకుతాయి. దొరికినప్పుడు కడుపు పగిలేలా కదల్లేనంతగా తింటాయి. మళ్లీ ఐదేళ్ల వరకు ఏమీ దొరక్కపోయినా బతకగలగటం వాటి ప్రత్యేకత. విలక్షణమైన శరీర అమరిక, ప్రత్యేక జన్యువులే ఈ సుదీర్ఘ, అద్భుత మనుగడ సామర్థ్యానికి కారణమని పరిశోధకులు గుర్తించారు. 

పెద్ద జీర్ణాశయం.. ప్రత్యేక జన్యువు.. 
20 అంగుళాల సైజు వరకు పెరిగే ఈ ఐసోపాడ్‌లలో జీర్ణాశయం చాలా పెద్దది. మొత్తం శరీరంలో దాదాపు మూడింట రెండు వంతులు వాటి పొట్టే ఆక్రమిస్తుంది. ఆహారం దొరికినప్పుడు భారీ మొత్తంలో నిల్వ చేసుకోగలవు. ఒక ప్రత్యేక జన్యువు ఏళ్ల తరబడి ఉపవాసానికి దోహదపడుతోందట. అదే ‘ఎన్‌డీ1’. ఇది స్వతహాగా వాటిది కాదు. ఒక బ్యాక్టీరియా నుంచి గ్రహించిన జన్యువు కావడం విశేషం. తీవ్రమైన చలి వాతావరణంలో ఈ జన్యువు ఒక స్విచ్‌లా పనిచేసి, ప్రాథమిక జీవక్రియ రేటు (బీఎంఆర్‌)ను అత్యంత కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది. దీనివల్ల శరీరంలో నిల్వ ఉన్న శక్తి చాలా నెమ్మదిగా ఖర్చవుతుంది. 

వాటికి గల వినూత్న శారీరక, జన్యుపరమైన రక్షణ విధానం వల్లే సుదీర్ఘకాలం ఉపవాసం ఉంటూ ప్రాణాలు నిలుపుకోగలుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన చలి వాతావరణంలో ఆకలిని తట్టుకునే సామర్థ్యాన్ని ఈ జన్యువు 37% మేర పెంచుతోందని పరిశోధనల్లో తేలింది. ఈ జీవి జీర్ణాశయంలో ఉండే క్లామిడియా అనే బ్యాక్టీరియా కొవ్వును సమర్థంగా నిల్వ చేయడానికి సహాయపడుతోందట. వ్యోమగాములు, అతిశీతల ప్రదేశాల్లో సైనికుల ఆహార అవసరాలు తీర్చే పరిశోధనలకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని భావిస్తున్నారు. అంతేనా..? మనుషుల్లో ఊబకాయాన్ని తగ్గించే ఔషధాల తయారీకీ భవిష్యత్తులో ఉపయోగపడొచ్చేమో!   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement