గుండె.. 95 కిలో మీటర్లు.. 63 నిమిషాలు | Donor Heart Transported 95 Km From Haryana To Delhi In 63 Minutes | Sakshi
Sakshi News home page

గుండె.. 95 కిలో మీటర్లు.. 63 నిమిషాలు

Sep 18 2026 9:20 AM | Updated on Sep 18 2026 9:26 AM

Donor Heart Transported 95 Km From Haryana To Delhi In 63 Minutes

హర్యానాలోని రోహ్‌తక్‌ నుంచి ఢిల్లీకి 95 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 63 నిమిషాల్లో అధిగమిస్తూ ఓ దాత గుండెను తరలించారు. అత్యవసర గుండె మార్పిడి కోసం గురువారం ఈ అవయవాన్ని షాలిమార్‌ బాగ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోహ్‌తక్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో రాత్రి 7.20 గంటలకు దాత గుండెను సేకరించారు.

అనంతరం గుండెను వైద్య బృందం 7.40 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరింది. హర్యానా, ఢిల్లీ పోలీసుల సమన్వయంతో ఏర్పాటు చేసిన గ్రీన్‌ కారిడార్‌ ద్వారా అంబులెన్స్‌ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించి.. రాత్రి 8.43 గంటలకు ఢిల్లీలోని షాలిమార్‌ బాగ్‌ ఫోర్టిస్‌ ఆసుపత్రికి చేరుకుంది. బి-పాజిటివ్‌ రక్తగ్రూప్‌ కలిగిన ఓ రోగికి గుండె అవసరమని ఉదయం 8.50 గంటలకు నేషనల్‌ ఆర్గన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఆసుపత్రికి సమాచారం అందింది.

ఉదయం 9.55 గంటలకు ఫోర్టిస్‌ ఆసుపత్రి వైద్యులు గుండెకు సరిపడే గ్రహీతను గుర్తించారు. వైద్య బృందం మధ్యాహ్నం 2.49 గంటలకు ఢిల్లీ నుంచి రోహ్‌తక్‌కు బయలుదేరి.. సాయంత్రం 4.34 గంటలకు ఆసుపత్రికి చేరుకుంది. గుండె సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం గ్రీన్‌ కారిడార్‌ ద్వారా అవయవాన్ని తిరిగి ఢిల్లీకి తరలించారు.

95 కిలోమీటర్ల అంతర్రాష్ట్ర మార్గంలో గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేసి గుండెను తరలించడం అంటే పోలీసు, వైద్య బృందాల మధ్య అసాధారణ స్థాయిలో సమన్వయం అవసరం. ఈ తరలింపులో ప్రతి నిమిషం కీలకం అని ఫోర్టిస్‌ ఆసుపత్రి షాలిమార్‌ బాగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఫెసిలిటీ డైరెక్టర్‌ నవీన్‌ శర్మ తెలిపారు. అనంతరం దాత గుండెను ఆసుపత్రికి తీసుకెళ్లి.. అవయవ మార్పిడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ‘పిట్‌బుల్‌’ బీభత్సం.. సీసీటీవీలో భయానక దృశ్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement