ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలపార్ట్‌టైమ్‌ లెక్చరర్లకు అండగా ఉంటాం | YSRCP President YS Jagan assures part time unaided lecturers | Sakshi
Sakshi News home page

ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలపార్ట్‌టైమ్‌ లెక్చరర్లకు అండగా ఉంటాం

Aug 8 2026 4:55 AM | Updated on Aug 8 2026 4:55 AM

YSRCP President YS Jagan assures part time unaided lecturers

వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ భరోసా 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న పార్ట్‌టైమ్, అన్‌ ఎయిడెడ్‌ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి న్యాయం జరిగే వరకు వారికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అవసరమైన అన్ని వేదికలపై వారి సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. ఏపీ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజెస్, పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ దీర్ఘకాలిక సమస్యలను వివరించారు.

అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అరిగ జోషిరావు తదితరులు వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేసి, తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో 15 నుంచి 25 సంవత్సరాలుగా అన్‌ ఎయిడెడ్‌ పోస్టుల్లో పని చేస్తున్న పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి ఇప్పటికీ సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడం లేదని వాపోయారు. ప్రభుత్వం 10+2 విధానంలో కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీ చేపట్టే సమయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన పార్ట్‌ టైమ్, అన్‌ ఎయిడెడ్‌ లెక్చరర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 

వారి సర్వీస్, అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన వెయిటేజీ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌తో పాటు సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని కోరారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగుల సర్వీస్, విద్యార్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని వారి రెగ్యులరైజేషన్‌కు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

అసోసియేషన్‌ ప్రతినిధుల సమస్యలు, డిమాండ్లను సావధానంగా విన్న జగన్‌.. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement