చైర్మన్ చలసాని ఆంజనేయులుతో బలవంతపు రాజీనామా
డెయిరీని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు సర్కారు పెద్దల రౌడీయిజం
వారి తరఫున మంత్రులు పార్థసారధి, కొల్లు రవీంద్ర నేరుగా తీవ్ర బెదిరింపులు
ఒత్తిడి తట్టుకోలేక ఆస్పత్రిపాలైన చైర్మన్.. డిశ్చార్జ్ చేయాలంటూ ఆస్పత్రిపైనా ఒత్తిడి
ఆస్పత్రి బెడ్‌పై నుంచే రాజీనామా లేఖ తీసుకున్న మంత్రి పార్థసారధి
కొల్లు రవీంద్ర ఇంట్లో డైరెక్టర్ల నిర్బంధం
రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్న విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్)ని నిర్వీర్యం చేసే కుతంత్రం
గన్నవరం వద్ద ఉన్న 24 ఎకరాల అత్యంత విలువైన భూమిపై పెద్దల కన్ను
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ పెద్దల కన్ను పడితే చాలు ఎందాకైనా సై అంటూ రెచ్చిపోతున్న తీరు హద్దులు దాటింది. తమ స్వార్థం కోసం రూ.1200 కోట్ల టర్నోవర్, వందల కోట్ల ఆస్తులున్న విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్)ని నిర్వీర్యం చేసే కుతంత్రానికి తెర లేపింది. ఈ క్రమంలో టీడీపీకే చెందిన విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ను తీవ్రంగా బెదిరించి.. ఆస్పత్రి పాలయ్యేలా చేసి.. ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతుండగానే ఆయనతో బలవంతంగా రాజీనామా లేఖ రాయించుకుని తీసుకెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో, టీడీపీ శ్రేణుల్లోనూ కలకలం రేపింది.
చలసాని డెయిరీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయకూడదంటూ కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు మంత్రుల ద్వారా ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అయితే అత్యధిక శాతం డైరెక్టర్లు చలసానికి మద్దతు ఇవ్వడంతో గురువారం చలసాని ఆంజనేయులు మరోసారి విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారనే విషయం తెలుసుకుని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారధి చలసాని వద్దకు వెళ్లారు. విజయ డెయిరీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే కేబినెట్ నుంచి అక్కడికి చేరుకుని మంత్రాంగం నడిపారు. ఆయన్ను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే మెజార్టీ డైరెక్టర్లు ఆయన్ను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో చంద్రబాబు, లోకేశ్ సూచనల మేరకు పక్కకు తప్పుకోవాలని మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి చిట్టి నగర్‌లోని డెయిరీ యూనిట్‌కు వెళ్లి మరీ ఆయన్ను బెదిరించారు. ఒకరోజు సమయం ఇస్తే అధిష్టానం చెప్పినట్లు చేస్తానని చెప్పినా, మంత్రులు ఒప్పుకోకుండా రాజీనామా చేయాల్సిందేనని పట్టుపట్టారు. తెల్ల పేపర్ ఆయన ఎదుట పెట్టి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాసి సంతకం చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో చలసాని అస్వస్థతకు గురవ్వగా కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యం కొనసాగుతున్నా రాజీనామాకు పట్టు
వైద్యం కొనసాగుతున్నప్పటికీ సదరు అమాత్యులు ఆయన్ను వదల్లేదు. వీరిద్దరూ కాకుండా.. గట్టిగా నోరేసుకుని విరుచుకుపడే మరో అమాత్యుడు ఏకంగా ఆ ఆస్పత్రి యాజమాన్యానికే ఫోన్ చేసి.. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. అయితే మానవతా దృక్పథంతో ఆ ఆస్పత్రి వైద్యం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి పార్థసారధి శుక్రవారం ఆ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి బెడ్‌పై స్టెంట్ వేయించుకోవాల్సిన స్థితిలో ఉన్నా, మానవత్వాన్ని కూడా మరిచి రాజీనామా లేఖపై సంతకం చేయించి బలవంతంగా తీసుకున్నారు. ఆ లేఖ తీసుకుంటున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది.
మంత్రి కొల్లు ఇంట్లో డైరెక్టర్ల నిర్బంధం
మరోవైపు శుక్రవారం విజయ డెయిరీ డైరెక్టర్లందరినీ మంత్రి కొల్లు రవీంద్ర చర్చల కోసం తన ఇంటికి పిలిపించి నిర్బంధించారు. చలసానికి వారు మద్దతు పలుకుతుండడంతో రాత్రి వరకు అక్కడే ఉంచారు. తాము ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యక్తిపై అవిశ్వాసం ఎలా పెడతామని డైరెక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈలోపు చలసాని ఆంజనేయుల్ని బెదిరించారు. డెయిరీ వ్యవహారాలపై విచారణ జరిపించి కేసులు పెడతామని, రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా వదలకుండా రాజీనామాకు ఒప్పించాలని ఒత్తిడి చేశారు. ఆయన కుమార్తెను ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. మరోవైపు అమెరికాలో ఉన్న ఆయన కుమారుడికి ఫోన్ చేసి రాజీనామా చేయకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని మంత్రులు హెచ్చరించారు.
అధిష్టానం ఆదేశించిందట..
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా అధిష్టానం ఆదేశించింది రాజీనామా చేయాలని చలసానిపై ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం? బోర్డు మొత్తం చలసాని ఆంజనేయుల్ని ఎన్నుకుంది. మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి బోర్డు సభ్యులను పిలిచి ఆంజనేయుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేయాలని చెప్పారు. లేనిపక్షంలో అవిశ్వాసం పెట్టండని అడిగారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికైన వారిని అదే రోజు రాజీనామా చేయమనడం, అనారోగ్యంతో ఉన్నా వేధించడం మంచి పద్దతి కాదు. – వేమూరి సాయి, డైరెక్టర్
హెరిటేజ్ కోసమే!
» విజయ డెయిరీ (కృష్ణా మిల్క్ యూనియన్) 1.50 లక్షల కుటుంబాల సంస్థ. ఒక్క విజయవాడలోనే 2.60 లక్షల లీటర్లు, రాష్ట్రమంతా కలిసి 4.60 లక్షల లీటర్ల పాలను ప్రతి రోజూ వినియోగదారులకు అందిస్తోంది.
» పాలు, నెయ్యి, పెరుగుతో పాటు దాదాపు 84 రకాల పాల ఉత్పత్తులను తయారు చేస్తోంది.
» బాపులపాడు మండలం వీరవల్లిలో ఇటీవల తన రెండవ యూనిట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త యూనిట్ ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్ల పాలు, లక్ష లీటర్ల పెరుగు ఉత్పత్తి చేస్తోంది. రైతుల నుంచి ప్రతి రోజూ 10 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
» ఇది సాకారమైతే విజయవాడ, కృష్ణా జిల్లాల్లో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైయిరీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోతుంది. మరోవైపు మ్యాక్స్ చట్టంలోకి మారిన విజయ డైయిరీ విస్తరణ దిశగా ముందుకు పోతుంది. ఇది జరగకూడదనే చలసానిని బలవంతంగా చైర్మన్ పదవి నుంచి తప్పించారని స్పష్టమవుతోంది.
» ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు తన హెరిటేజ్ డెయిరీ ప్రయోజనాల కోసం చంద్రబాబు చిత్తూరు డెయిరీని పక్కా ప్రణాళికతో నిర్వీర్యం చేసిన చరిత్ర గుర్తుకు తెస్తోందని రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు.
» దీంతో పాటు విజయ డెయిరీకి ఉన్న రూ.వందల కోట్ల ఆస్తులతో పాటు.. గన్నవరం వద్ద ఉన్న 24 ఎకరాల భూమిపై పెద్దల కన్ను పడిందని తెలుస్తోంది.
» ప్రభుత్వం తీరు సరికాదని విజయ డైరెక్టర్లు విమర్శిస్తున్నారు. బుడమేరు వరద సమయంలో ఏమాత్రం పట్టించుకోలేదని, అసలు సహకార రంగంలో ఉన్న డైయిరీ విషయంలో ఈ బెదిరింపులు ఏమిటని వారు నిలదీస్తున్నారు.
» ఆరు దశాబ్దాలుగా లక్షలాది మంది రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన విజయ (కృష్ణా మిల్క్ యూనియన్) డెయిరీని హెరిటేజ్ కోసం బలిచేసే లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీ.కృష్ణయ్య, కే.ప్రభాకర రెడ్డిలు తప్పుపట్టారు.


